ప్రత్యామ్నాయ తీరు ఇదేనా?

ప్రత్యామ్నాయ తీరు ఇదేనా?

తెలంగాణ అనే పసిబిడ్డ బాలారిష్టాల దశదాటాల్సి ఉందని అందుకు టీఆర్ఎస్ రక్షణ కవచంలా ఉంటుందని, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే టీఆర్ఎస్ విజయం సాధించాల్సి ఉందని తెలంగాణ  తొలి ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ అన్నారు. ఏమాత్రం తడబడినా సాధించిన రాష్ట్రం ఈనగాచి నక్కల పాలైనట్లు విద్రోహశక్తుల వికృత క్రీడలో విలవిలలాడుతుందని ప్రాంతీయ వాదాన్ని రక్తికట్టించారు. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టో పెట్టి రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అధికారం చేపట్టిన ఆయన.. నాలుగేళ్ల పాలన తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ సెంటిమెంట్ సహా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరి అవలంబించే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, తాము తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం కొనసాగేందుకు మరోసారి ఆశీర్వదించాలనే నినాదంతో మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు మరో సారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమైన, ప్రజా వ్యతిరేక పాలనను గద్దెదించి అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సహా మరో అరడజను పార్టీలు పోటీపడుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు అసలు ఆ లక్ష్యం దిశలో ఉన్నాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. 

ప్రజలకు భరోసా ఇస్తున్నాయా?

నాలుగున్నరేండ్ల పాలన పూర్తి చేసుకొని బీఆర్​ఎస్​పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుండగా ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎం చేస్తామో చెప్పడంలో, ప్రజలకు భరోసా కల్పించడంలో వెనుకబడే ఉన్నాయి. ఫలానా సమస్యకు సంబంధించి.. ఇదిగో ఈ హామీతో ముందుకొస్తున్నాం.. అనే పార్టీ ఏదీ లేదు. ప్రజల నోళ్లలో నానాల్సిన ప్రత్యామ్నాయ డెవలప్​మెంట్​మోడల్​ఇంకా చర్చలోనే లేదు. నామమాత్రపు కార్యక్రమాలు,  బహిరంగ సభలు, కాలం చెల్లిన ఫార్ములా పాదయాత్రలతో కాలం వెళ్లదీస్తున్నట్టే కనిపిస్తున్నది కానీ.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టి భారీ ఉద్యమాలు నిర్మిస్తున్నట్టు అనిపించడంలేదు. దిశ ఘటన, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థుల ఉద్యమం, నేరెళ్ల దళితులపై దాడులు, సంక్షేమ వసతి గృహాల సమస్యలతో పాటు, ఇటీవల జరిగిన టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన మినహా మరో సమస్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్థాయిలో తెరమీదకు రాలేదంటే పార్టీల ఉదాసీనత ఎలా ఉన్నదో తెలుస్తున్నది. మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని అనేక విషయాల అమలుకు పాలకపక్షాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. 

రైతులకు రుణమాఫీ ఇంకా పూర్తికాకపోవడం, దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీ అటకెక్కించి కొత్తగా దళిత బంధు తెర మీదకు తేవడం లాంటి అంశాలపై సుదీర్ఘ పోరాటాలకు అవకాశం ఉండగా ఉద్యమాలు చేయకపోవడం తమ ప్రభుత్వం వస్తే ఇది అమలు చేస్తామని కానీ, దళిత బంధులో అక్రమాలున్నాయని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ప్రకటిస్తే సత్వరమే  స్పందించి  దోషులెవరో బహిర్గతపర్చి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్​చేసే ప్రయత్నాలు జరగాల్సిన స్థాయిలో జరగడం లేదు.  కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ప్రకటిస్తే స్పందించిన ముఖ్యమంత్రి... ఇది ఎలా సాధ్యమని అనేక ఆరోపణలు గుప్పించింది. ఆ పార్టీనే మేనిఫెస్టో లో పెట్టింది.  3016 భృతి అందిస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ అంశంపై చేపట్టే  ఉద్యమంలో నిరుద్యోగులు స్పందిస్తారు. కానీ వారిని తట్టి లేపే పార్టీలు లేకపోవడం గమనార్హం.  ప్రతిపక్షాల ఏమరపాట్లను, బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న పాలకపక్షం.. అధికార బలంతో ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్నది. ప్రతిపక్ష పార్టీలను, మీడియా, ప్రజలను బేఖాతరు చేసేంత పటిష్టంగా మారింది. తెలంగాణలో అనేక సమస్యలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు.. సరైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. 

గత వైఫల్యాల నుంచి పాఠం

ప్రతిపక్ష పార్టీలు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రస్తుత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి. గతంలో టీఆర్ఎస్ ​ప్రభుత్వం ముందస్తుకు వెళ్లినప్పుడు.. ప్రభుత్వ రద్దు వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో సారి అవకాశం ఇస్తే తమ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని, బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని ప్రజల విశ్వాసం పొందడంలో విజయం సాధించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్​పార్టీ టీఆర్ఎస్​అనూహ్య ప్రభుత్వ రద్దు నిర్ణయంతో వెంటనే  తేరుకొని ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సి ఉండగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు టికెట్ల కేటాయింపు ప్రక్రియనే పూర్తి చేయలేకపోయింది. తెలంగాణ జన సమితి, తెలుగు దేశం పార్టీకి కేటాయించే టికెట్ల విషయంలో ఎకాభిప్రాయం కోసం పలు సార్లు చర్చలు, మీటింగ్ లతో సమయం వృథా చేసి  కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకున్నది.  ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి ఒక స్పష్టమైన వైఖరితో 1998 ఎన్నికల్లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో ముందుకెళ్లింది. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతుతో తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినా.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో విస్తరించ లేదు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయ పరంపర, మోడీ హవాతో తెలంగాణ రాష్ట్రంలోనూ  అనూహ్యంగా 4 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ క్యాడర్​లో నూతన ఉత్సాహం వచ్చింది. 

హైదరాబాద్ మహా నగర పాలక ఎన్నికల్లో దాదాపు అధికార పార్టీకి సమంగా సీట్లు సాధించడం, దుబ్బాక, హుజూరాబాద్​లో విజయం సాధించడం.. ఇలా రాష్ట్రంలో అధికారం తామే చేపడుతామని ఆశాభావంలో బీజేపీ శ్రేణులున్నాయి. కానీ స్పష్టమైన హామీలతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే, పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు అన్ని నియోజకవరర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపడం ఇప్పుడు ఆ పార్టీ ముందు ఉన్న సవాలు. అధికార పార్టీ వ్యూహాలను ఛేదించి విజయ తీరాలకు చేరడం అంత ఈజీ కాదు. మునుగోడు ఎన్నికల్లో కొంత తేడాను గ్రహించిన అధికార పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కోరడం, గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాదులో ఓటమిని పసిగట్టి మండవ వెంకటేశ్వరరావు మద్దతు కోరడం, వంటి అంశాలను గమనిస్తే అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు. ఇంతలా వెళ్లూనుకుపోయిన పాలక పక్షాన్ని ఢీకొనాలంటే ప్రతిపక్ష పార్టీలు అంతకు మించిన నిర్విరామ కృషితో పాటు తొమ్మిదేండ్ల టీఆర్ఎస్​పాలన వైఫల్యాలను ఎండగట్టాలి. అధికారంలోకి వస్తే తాము చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి స్పష్టతనిచ్చి ఆత్మ విశ్వాసం కల్పించడం, వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైతే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.

-  డా. కె. ప్రవీణ్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ