రెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

రెండు సభల్లో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పార్లమెంట్ శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ధరల పెరుగుదలపై చర్చకు పట్టుపట్టాయి. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ బీజేపీ నేతలు కూడా నినాదాలు చేశారు. రాష్ట్రపతి వివాదంపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.  దీంతో రెండు సభల్లోనూ ఎలాంటి చర్చ జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. నినాదాలు చేశారు. అదే టైమ్ లో రాష్ట్రపతిపై కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధురి చేసిన కామెంట్లకు బాధ్యత వహిస్తూ సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనంక అదే పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ చైర్​లో కూర్చున్న రాజేంద్ర అగర్వాల్  సోమవారానికి వాయిదా వేశారు.  

రాజ్యసభలోనూ అదే తీరు.. 

రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్ లో కల్తీ మద్యం తాగి 40 మంది చనిపోయిన అంశాన్ని లేవనెత్తారు. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే టైమ్ లో బీజేపీ నేతలు కూడా నినాదాలు చేశారు. సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనంక అదే పరిస్థితి కొనసాగడంతో సోమవారానికి వాయిదా వేశారు. 

రాత్రి పార్లమెంట్ లోనే ఎంపీలు

సస్పెండ్ అయిన ఎంపీలు గురువారం రాత్రి నిరసన కొనసాగించారు. టీఎంసీ ఎంపీలు డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, మౌసమ్ నూర్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాత్రంతా పార్లమెంట్​లోనే ఉన్నారు. తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు 50 గంటల ధర్నా చేపట్టారు.