- సీఈసీ రాజీనామా చేయాలని
- జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన
- ముందస్తుగా 12 మెట్రో స్టేషన్ల మూత
- ర్యాలీలపై నిషేధాజ్ఞలు..
- వేలాదిగా పోలీసుల మోహరింపు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌చేశాయి. సర్‌లో భాగంగా భారీగా ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర వివిధ విద్యార్థి సంఘాలు, పలు యువజన సంఘాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘ఏక్ కచోరీ, దో సమోసా, జ్ఞానేశ్ తుమ్హారా క్యా భరోసా’, ‘గలీ గలీ మే షోర్ హై, మోదీ -జ్ఞానేశ్ ఓట్ చోర్ హై’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అయితే, జంతర్‌మంతర్‌వద్ద ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు సుమారు వెయ్యి మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, సంజయ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంజయ్ సింగ్ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. అశోకా రోడ్ రౌండ్‌ఎబౌట్ వద్ద జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు యత్నించిన దాదాపు 1100 మంది ఎస్ఎఫ్ఐ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలు
జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేస్తూ.. భారీగా బలగాలను మోహరించారు. అనుమతి కోరుతూ వారం రోజుల క్రితమే లేఖ ఇచ్చామని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకుందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. పోలీసుల చర్యలను ఎస్ఎఫ్ఐ, ఐసా నాయకులు తీవ్రంగా ఖండించారు. కాగా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నిరసన ప్రాంగణం, దాని పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఈసీ జ్ఞానేశ్ రాజీనామాకు ఆమె డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు వల్ల ఎన్నికల వ్యవస్థపై నమ్మకం సడలుతోందని, దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని ఢిల్లీ మాజీ సీఎం అతిశీ డిమాండ్ చేశారు.
