అగ్రి బిల్లులపై రచ్చ..డ్రాఫ్ట్ లు చింపి, మైక్ లు విరిచి..

అగ్రి బిల్లులపై రచ్చ..డ్రాఫ్ట్ లు చింపి, మైక్ లు విరిచి..
  •     బిల్లు డ్రాఫ్ట్ పేపర్లను చింపి విసిరిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్
  •     గందరగోళం మధ్యే రెండు బిల్లులు పాస్
  •     మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ.. వ్యతిరేకించిన టీఆర్ఎస్

వ్యవసాయ సంస్కరణ బిల్లులపై రాజ్యసభ రణరంగమైంది. ప్రతిపక్ష ఎంపీలు బిల్లు డ్రాఫ్ట్ పేపర్లు చింపి విసిరారు. మరికొందరు మైకులు విరిచేందుకు ప్రయత్నించారు. పోడియంపైకి ఎక్కారు. ఈ గందరగోళం మధ్యనే రెండు బిల్లులను వాయిస్ ఓటు ద్వారా సభ పాస్ చేసింది. వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతివ్వగా.. టీఆర్ఎస్ వ్యతిరేకించింది. వ్యవసాయ బిల్లులు గట్టెక్కేందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సహకరించారని ఆరోపిస్తూ టీఆర్​ఎస్​ సహా 12 పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. అగ్రి బిల్లులతో దేశంలో వ్యవసాయ రంగ రూపురేఖలు మారిపోతాయని, రైతులు ఎంపవర్​ అవుతారని ప్రధాని మోడీ అన్నారు.

న్యూఢిల్లీ, వెలుగు: వ్యవసాయ సంస్కరణ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభ రణరంగమైంది. కరోనా కాలంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో.. జాగ్రత్తలు, రూల్స్ మరిచిన ప్రతిపక్ష సభ్యులు ఏకంగా డిప్యూటీ చైర్మన్ పోడియంపైకి ఎక్కారు. వెల్​లో నినాదాలు చేశారు. బిల్లు డ్రాఫ్ట్ పేపర్లు చింపి విసిరారు. సభ ప్రొసీడింగ్స్ కు అడ్డుతగిలారు. గందరగోళం మధ్యనే రెండు బిల్లులను వాయిస్ ఓటు ద్వారా సభ పాస్ చేసింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్​ను రాజ్యసభ రిజెక్ట్ చేసింది. వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతివ్వగా.. టీఆర్ఎస్ వ్యతిరేకించింది.

వెల్​లోకి దూసుకొచ్చి..

తొలుత కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్లు-–2020, ఫార్మర్స్(ఎంపవర్ మెంట్, ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్, ఫార్మ్ సర్వీసెస్ బిల్లు–-2020ను రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. కనీస మద్దతుతో పంట కొనుగోలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని వివరించారు. ఇదే సమయంలో వ్యవసాయ బిల్లులను విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, శిరోమణి అకాళీదళ్, ఎన్సీపీ, బీఎస్పీ, ఎస్పీ, టీఆర్ఎస్​తో పాటు 14 పార్టీలు డిమాండ్‌‌ చేశాయి. రెండు బిల్లులపై నరేంద్ర సింగ్ తోమర్ రిప్లైని సోమవారం వరకు వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చారు. దీంతో రభస మొదలైంది. సభ్యులు వెల్​లోకి దూసుకొచ్చారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, కొందరు ప్రతిపక్ష ఎంపీలు.. హరివంశ్​కు రూల్ బుక్ చూపిస్తూ పోడియంపైకి ఎక్కారు. బిల్లు డ్రాఫ్ట్ పేపర్లను చింపి పోడియంపైకి విసిరారు. ఆప్ ఎంపీలు డిప్యూటీ చైర్మన్​పై పేపర్లు విసరగా… అడ్డుగా నిలిచిన మార్షల్స్ చేతులకు తగిలాయి. టీఎంసీ, ఆప్, అకాలీదళ్‌‌ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకు‌‌లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. మరికొందరు నినాదాలు చేస్తూ  ప్రిసైడింగ్ ఆఫీసర్​ను వెక్కిరించారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో  ప్రొసీడింగ్స్​ను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

టేబుల్ ఎక్కి..

సభ మళ్లీ సమావేశమయ్యాక కూడా ప్రతిపక్ష సభ్యులు వెల్​లోకి వెళ్లి స్లోగన్స్ చేశారు. అందులో కొందరు అధికారుల టేబుల్ పైకి ఎక్కారు. దీంతో మాట్లాడిన హరివంశ్.. ‘‘డివిజన్ ఓటును వెల్ దగ్గర నిలబడి అడగలేరు. ముందు సభ్యులు వెళ్లి వాళ్ల సీట్లలో కూర్చోవాలి’’ అని సూచించారు. సభలో నినాదాలు, గందరగోళం కొనసాగుతుండగానే.. రెండు బిల్లులను వాయిస్ ఓటు కోసం సభ ముందు ఉంచుతున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. తర్వాత బిల్లులు పాస్ చేసినట్లు తెలిపారు. సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక మూడోది ఎస్సెన్షియల్ కమొడిటీస్ (అమెండ్ మెంట్) బిల్లు-–2020ని తర్వాత సపరేట్ గా సభలో ప్రవేశపెట్టనున్నారు.

కాంగ్రెస్ వర్సెస్ వైఎస్సార్సీపీ

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లులకు మద్దతుగా వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. లోక్ సభ  ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఈ బిల్లుల్లో ఉన్నాయని, అందుకే కాంగ్రెస్ హిపోక్రసీ చేస్తోందని ఆరోపించారు. దళారులను కాంగ్రెస్ ప్రమోట్ చేస్తోందనడంతో దుమారం రేగింది. ‘సభ్యుడి ప్రవర్తన సభ సంప్రదాయాల ప్రకారం లేదు. ఆయన తన ప్రకటనను విత్ డ్రా చేసుకోవాలి. క్షమాపణ చెప్పాలి’ అని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.

వెంకయ్య నివాసంలో మీటింగ్

రాజ్యసభలో నెలకొన్న పరిస్థితులపై చైర్మన్ వెంకయ్య నాయుడు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, రెండు సభల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

డిప్యూటీ చైర్మన్‌‌పై అవిశ్వాస తీర్మానం

వ్యవసాయ బిల్లులు గట్టెక్కేందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సహకరిం చారని ఆరోపిస్తూ 12 పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, ఆర్జేడీ, తృణముల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఈ నోటీసులు ఇచ్చాయి. సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినా డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారని ఫైర్ అయ్యాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ చైర్మన్ తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ మండిపడ్డారు.

నల్ల చట్టాలు: రాహుల్

కనీస మద్దతు ధరకు లీగల్ రెస్పాన్సిబులిటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోంద ని కాంగ్రెస్ ప్రశ్నించింది.  కేంద్రం కొత్తగా తీసు కొచ్చిన బిల్లులు.. ‘వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏపీఎంసీ లేదా రైతు మార్కెట్ లేకుంటే ఇక ఎంఎస్పీ ద్వారా ఎలా పంట కొను గోలు చేస్తారని ప్రశ్నించారు. ఎంఎస్పీ విషయం లో గ్యారెంటీ ఎందుకు లేదని నిలదీశారు. రైతు లను కాపిటలిస్టులకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘కిసాన్ విరోధి నరేంద్ర మోడీ’ హాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.

టర్నింగ్ పాయింట్: మోడీ

ఈ వ్యవసాయ బిల్లులు పాస్ చేయ డం.. దేశ అగ్రికల్చర్ హిస్టరీలోనే టర్నింగ్ పాయింట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేస్తాయని, కోట్ల మంది రైతుల ను ఎంపవర్ చేస్తాయని చెప్పారు.  బిల్లులు ఆమోదం పొందిన తర్వాత మోడీ పలు ట్వీట్లు చేశారు. ప్రతిపాదిత చట్టాలు రైతులను అనేక కష్టాల నుంచి విముక్తి చేస్తాయని చెప్పారు.