
పట్నా: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం బిహార్ రాజధాని పట్నాలో ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలు తమ రాజకీయాల ప్రయోజనాల కోసం పాకులాటలో పాకిస్థాన్ కు మేలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు అడిగిన ఈ నేతలు.. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ కు రుజువులు చూపించాలని కోరుతున్నారని అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకమవ్వాల్సిన సమయంలో 21 పార్టీలు మాత్రం బలగాల్ని ప్రశ్నించడానికి ఒక్కటయ్యాయని చెప్పారు. ఆ పార్టీల నేతలు తమ మాటలతో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు తమ రాజకీయాల కోసం ఎయిర్ స్ట్రైక్స్ కు ప్రూఫ్స్ అడిగి సైన్యాన్ని అవమానిస్తున్నారని అన్నారు.
శత్రు దేశానికి మేలు చేసేలా ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారో వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. పాకిస్థాన్ ఆ మాటలను పట్టుకుని గొప్పగా చెప్పుకుంటోందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మోడీ చూస్తుంటే.. ప్రతిపక్షాలు మోడీని అంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ప్రధాని అన్నారు. దేశ భద్రత విషయంలో వారి తీరు ఏ మాత్రం సరిగా లేదన్నారు.
చౌకీదార్ పై బురదజల్లడానికి వాళ్లు పోటీపడుతున్నారని మోడీ చెప్పారు. కానీ చౌకీదార్ అలర్ట్ గా వ్యవహరిస్తున్నాడన్నారు. నవ భారతంలో జవాన్ల త్యాగాన్ని వృథాగా పోనివ్వమని మోడీ చెప్పారు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడాన్ని దేశమంతా చూస్తోందన్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మోడీ. బిహార్ లో కొందరు గడ్డిని కూడా వదల్లేదంటూ దాణా కుంభకోణాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిని అంతం చేశామని మోడీ అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యవర్తి వ్యవస్థను లేకుండా చేశామన్నారు.