పెరుగుతున్న ఎండలు..  సగానికిపైగా జిల్లాలకు  ఆరెంజ్​ అలర్ట్​

పెరుగుతున్న ఎండలు..  సగానికిపైగా జిల్లాలకు  ఆరెంజ్​ అలర్ట్​
  • పెరుగుతున్న ఎండలు..  సగానికిపైగా జిల్లాలకు  ఆరెంజ్​ అలర్ట్​
  • వీణవంక, జైనలో అత్యధికంగా  44.3 డిగ్రీలు నమోదు
  • మరో నాలుగు రోజులు  ఇలాగే ఉండే చాన్స్​
  • వీణవంక, జైనలో అత్యధికంగా  44.3 డిగ్రీలు నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురువగా.. చాలా చోట్లా ఎండ దంచికొట్టింది. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సగానికిపైగా జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్​భూపాలపల్లి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాగా, గురువారం వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, నాగర్​కర్నూల్, గద్వాల, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రాజేంద్రనగర్, కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అత్యధికంగా 1.9 సెంటీ మీటర్ల వర్షం పడింది.

కాగా, కరీంనగర్​ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్​భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో 44.1, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8, ఆదిలాబాద్​ జిల్లా చాప్రాలలో 43.3, నిర్మల్​ జిల్లా బుట్టాపూర్​లో 42.8, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​లో 42.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.