ముంబైలో ఆగని వర్షాలు.. సిటీ మొత్తం ఆరెంజ్ అలర్ట్

ముంబైలో ఆగని వర్షాలు..  సిటీ మొత్తం ఆరెంజ్ అలర్ట్

ముంబై సిటీని వర్షాలు వదలడం లేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ముంబై సిటీ మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలోనే అల్లాడుతున్నాయి. ఇప్పటికీ వర్షం పడుతుండటంతో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. ముంబై సిటీలోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. అండర్ బ్రిడ్జిలు జలమయమయ్యాయి. అందేరీలోని అండర్ బ్రిడ్జిలో భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. 

భారీ వర్షాలు కురుస్తుండటంతో.. బృహణ్ ముంబై అధికారులు అలర్ట్ అయ్యారు. అన్ని సర్కిల్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్‌లో ఇద్దరు మహిళలు పడిపోయినట్టు వార్తలు రావడంతో.. అన్ని మ్యాన్ హోల్స్‌ని చెక్ చేయాలని సూచించారు. సబ్‌వే రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ముంబైలో జూన్ నెలలో పడాల్సిన వర్షాపాతంలో 94 శాతం ఇప్పటికే కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ముంబై జూన్ నెల సాధారణ వర్షాపాతం 505 మిల్లీమీటర్లు కాగా.. ఇఫ్పటికే 474 మిల్లీ మీటర్ల వర్షం పడిందన్నారు. ముంబైలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో శాంటాక్రూజ్‌లో 10 సెంటీమీటర్లు, కొలాబాలో 2 రెండుమీటర్ల వర్షం పడిందని అధికారులు తెలిపారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా పడటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే అయిదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలపడంతో మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.