రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు.. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు.. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలో రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్ లో చిరుజల్లులు కురిశాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. 

రాష్ట్రంలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్  మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్  అలర్ట్ ను జారీ చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని తెలిపారు అధికారులు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేశారు. మరోవైపు నల్లగొండలో నిన్న 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒకటి నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా టెంపరేచర్లు నమోదైనట్లు తెలుస్తోంది.