గ్రూప్1 లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి: హైకోర్టులో బక్క జడ్సన్

గ్రూప్1 లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి: హైకోర్టులో బక్క జడ్సన్

హైకోర్టులో కాంగ్రెస్‌‌ నేత బక్క జడ్సన్‌‌ పిటిషన్‌‌ దాఖలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌1 ప్రిలిమ్స్‌‌ పేపర్‌‌‌‌ లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనికోరుతూ దాఖలైన మరో పిల్‌‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇదే తరహా పిటిషన్‌‌ సింగిల్‌‌ జడ్జి వద్ద విచారణలో ఉంది. తాజాగా కాంగ్రెస్‌‌ పార్టీ నాయకుడు బక్క జడ్సన్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ను కోర్టు విచారణ జరిపింది. గ్రూప్‌‌ 1 ప్రిలిమ్స్‌‌ లీకేజీపై దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిల్‌‌కు నంబర్‌‌ కేటాయించేందుకు రిజిస్ట్రీ చెప్పిన అభ్యంతరాన్ని తోసిపుచ్చింది.
 పిల్‌‌కు నంబర్‌‌ కేటాయించాలని రిజిస్ట్రీని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. పేపర్‌‌ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌‌.. టీఎస్‌‌పీఎస్సీకి చెందిన కింది స్థాయి ఉద్యోగులపైనే కేసులు పెట్టిందని, పైస్థాయికి చెందిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్‌‌ లాయర్‌‌ వాదించారు. పేపర్‌‌ లీకేజీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులను విస్మరించిందన్నారు. 
కంప్యూటర్‌‌‌‌ పాస్‌‌వర్డ్‌‌ లీకేజీకి కారణమైన టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలపై ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పారు. ప్రభుత్వ లాయర్​ వాదన తర్వాత ప్రతివాదులైన సీఎస్‌‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌‌ పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్‌‌ సీపీ, సీబీఐ డైరెక్టర్లకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ, కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది.