కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నా : ఎస్వీ కృష్ణారెడ్డి

కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నా : ఎస్వీ కృష్ణారెడ్డి

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని జంటగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం విశేషం. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విచ్చేసి ట్రైలర్‌, టీజర్‌లను లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ... 'కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్‌.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్‌ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్‌. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్‌ కోసం కృష్ణారెడ్డి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్‌ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి.  ట్రైలర్‌ చూసిన తర్వాత కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్‌ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పనకి, యూనిట్‌ సభ్యులకు నా కృతజ్ఞతలు' అన్నారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... 'ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన డెడికేషన్‌, ప్లానింగ్‌ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నా కెరీర్‌లో ది బెస్ట్‌ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డికి, నిర్మాత కల్పనకి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఇక సోహెల్‌ను సంతోషం సురేష్‌ నాకు పరిచయం చేశారు. అతను కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్‌ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. ఇంత మంచి కంటెంట్‌ను తెరకెక్కించడంలో కెమెరామెన్‌ సి. రాంప్రసాద్‌ అద్భుతంగా పనిచేశారు. ఆయన ఎక్కడా రాజీపడే వ్యక్తి కాదు. డబ్బింగ్‌లో సినిమా చూస్తుంటే రాంప్రసాద్‌ మేజిక్‌ చూసి మురిసిపోయాను. ఫైట్స్‌, ఎడిటింగ్‌ ఇలా ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌ ఒక తపనతో పనిచేశారు. దాని రిజల్ట్‌ త్వరలో తెరమీద చూడబోతున్నారు' అన్నారు.