- రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హనుమకొండ జిల్లా: కాకతీయ వైభవ సప్తాహన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్ లో కాకతీయ సప్తాహంపై సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, సాంస్కృతిక శాఖ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కలెక్టర్ సీపీ తరుణ్ జోషి, మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా కార్యక్రమాల నిర్వహణ జరగాలన్నారు. దీని కోసం 50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. మున్సిపల్, కుడా శాఖల నుండి ఏర్పాట్లు చేపడతామని.. కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కాకతీయుల చరిత్ర, సామ్రాజ్య విస్తరణ, విశేషాలు ప్రజలకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన చేసే విదంగా కృషి చేయాలని సూచించారు. పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలి.. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
తెలంగాణ జాతి ఔన్నత్యం ప్రతిబింబించేలా కార్యక్రమాలు
సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలు తెలంగాణ జాతి ఔనాత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రేరణ... ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల నిర్మాణమేనని ఆయన పేర్కొన్నారు. కాకతీయ ప్రభువుల వారసునికి 111 మంది పేరిణి కళాకారులతో స్వాగతం, బాంజ్ దేవ్ వరంగల్ కోట సందర్శనలో ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, ఉమ్మడి వరంగల్ జిల్లా లోని అన్ని జిల్లా కేంద్రాలలో కాకతీయ వైభవన్నీ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాల రూపాకల్పన చేస్తున్నామని వివరించారు.
