అనాథల ఆకలి కేకలు..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అందని విరాళాలు

అనాథల ఆకలి కేకలు..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అందని విరాళాలు

వారంతా దిక్కూ మొక్కులేనివారు. అనాథశ్రమాల్లోనే ఉంటున్నారు. లాక్​డౌన్​వాళ్ల పరిస్థితిని మరీ దయనీయంగా మార్చేసింది. నెలన్నర రోజులుగా తినేందుకు తిండి కూడా లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాతల నుంచి వచ్చే నిత్యావసరాలు ఆగిపోయాయి. విరాళాలూ రావడం లేదు. దీంతో వాటిల్లో ఆశ్రయం పొందుతున్నవాళ్లకు తిండికి తిప్పలవుతున్నాయి.

హైదరాబాద్, వెలుగుఅసలే వారు ఏ దిక్కూ మొక్కులేనివాళ్లు. అందుకే అనాథశ్రమాల్లో ఉంటున్నారు. లాక్​డౌన్​తో వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సుమారు నెలన్నర రోజులుగా అమలవుతున్న లాక్​డౌన్​ వల్ల అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల ఆశ్రమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాతల నుంచి వచ్చే నిత్యావసర సరుకులు ఆగిపోయాయి. విరాళాలూ రావడం లేదు. దీంతో వాటిల్లో ఆశ్రయం పొందుతున్నవాళ్లకు తిండికి తిప్పలవుతున్నాయి. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే..  మునుముందు ఎలా ఉంటుందోనని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందినవి 485 చిల్డ్రన్ హోంలు, 104 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. గుర్తింపు లేకుండా నిర్వహించేవి మరో వెయ్యి వరకు ఉంటాయి. వివిధ మత సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే హోంలు కూడా ఉన్నాయి. అన్నింటిలో కలిపి దాదాపు లక్ష మంది వరకు ఆశ్రయం పొందుతున్నట్లు అంచనా. లాక్​డౌన్​ కారణంగా ఈ ఆశ్రమాలన్నీ సమస్యల్లో చిక్కుకున్నాయి.

దాతలు రావడం లేదు

ఆశ్రమాలు ఎక్కువగా దాతల విరాళాలతోనే నడుస్తుంటాయి. పుట్టిన రోజులు, ఇతర స్పెషల్​ అకేషన్స్​ను  చాలా మంది దాతలు ఈ హోంలలోనే జరుపుకుంటారు. అలాంటి సమయంలో వారికి ఒకపూట అన్నం పెడుతుంటారు. ఇలా దాతల ద్వారా దాదాపు ప్రతి ఆశ్రమంలో దాదాపు నెలలో 20 రోజుల వరకు బతుకు బండి నడుస్తుంది. మిగిలిన రోజుల్లో ఆశ్రమాల నిర్వాహకులు సర్దుబాటు చేస్తుంటారు. లాక్​డౌన్​తో ఎవరూ బర్త్​డేలను, అకేషన్స్​ను ఆశ్రమాల్లో సెలబ్రేట్​ చేసుకునే పరిస్థితి లేదు. విరాళాలు ఇచ్చేవారు లేరు. ఫలితంగా పూర్తి భారం ఆశ్రమాలపైనే పడుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు అయిపోవడంతో నిర్వాహకులు అతికష్టమ్మీద అక్కడో ఇక్కడో డబ్బు సర్దుబాటు చేసి తమవంతుగా ఆశ్రమాల్లోని వాళ్లకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఆదేశాలతోనే ప్రభుత్వం సరి

పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు ఉండే హోమ్స్  నిర్వహణ ఎప్పటిలాగే  జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆరుగురు ఆఫీసర్లతో రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్​కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి ఆశ్రమాలకు లాక్​డౌన్​ పీరియడ్​లో అవసరమైన సరుకులు, సదుపాయాలతోపాటు, వాటి సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లకు, సివిల్​సప్లయీస్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లాల అధికారులను శాఖ ఆదేశించింది. దాదాపు అన్ని ఆశ్రమాల వారు తమ అవసరాలను అధికారులకు నివేదించారు. రెండున్నర వారాల కిందనే నివేదికలు కూడా ఇచ్చినా.. ఆశ్రమాలకు ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు.  ‘‘జిల్లా సంక్షేమ అధికారుల సూచన మేరకు ఆర్ఫనేజ్ హోమ్స్ వివరాలను, కావాల్సిన నిత్యావసర సరుకుల లిస్ట్​ను 25 రోజుల కింద పంపినం. ఇప్పటిదాకా సరుకులు రాలేదు’’ అని హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఓ అనాథాశ్రమ నిర్వాహకుడు నూతన్​ చెప్పారు.

హెల్త్​ చెకప్స్​ లేవు

కరోనా ప్రభావం ఎక్కువగా పదేండ్లలోపు చిన్నారులు, వృద్ధులపైనే ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా నివారణ చర్యలు ఎలా ఉన్నా.. సాధారణ ఆరోగ్య సమస్యలు ఈ వయస్సుల వారికే ఎక్కువగా ఉంటాయి. వృద్ధులకు రెగ్యులర్​గా హెల్త్  చెకప్​ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్లు ఎమర్జెన్సీ కేసులకే పరిమితమవుతున్నారు. దీంతో ఆశ్రమాల్లోని పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుస్తి చేస్తే ఎక్కడ చూయించుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు పూటలు అన్నం తిని 30 రోజులవుతోంది

‘పేట’ గమ్ సిటీలో చిన్నారుల అవస్థ

సంగారెడ్డి, వెలుగు: ఆ పది మంది పిల్లలు మూడుపూటల అన్నం తిని 30 రోజులవుతోంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని గురుకుల స్కూల్​గమ్ సిటీ ట్రస్టులో మొన్నటి వరకు ఇందులో 150 మంది పిల్లలు ఉండేవారు. ఇటీవలి కాలంలో చాలామంది పిల్లలను బంధువులు వారి ఇండ్లకు తీసుకుపోయారు. ప్రస్తుతం పది మంది పిల్లలు, ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. చారిటబుల్ ట్రస్ట్ నడిపే పరిస్థితిలో నిర్వాహకులు లేకపోవడంతో అందులోని సామాన్లు అమ్మి పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఇక్కడి కష్టాలు పడలేక ఓ బాలుడు ధైర్యం చేసి సిబ్బంది ఫోన్​లో తోచిన నంబర్ నొక్కి అక్కడి పరిస్థితుల గురించి వివరించాడు. ఎలాగైనా తమను ఆదుకోవాలని చిన్నారి ఏడుస్తూ చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు, స్థానిక తహసీల్దార్​కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్​ అంజయ్య, సీఐ శ్రీధర్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించి తోచిన సహాయం అందించి పిల్లలను బాగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.

అమ్మ ఒడి ఆర్ఫనేజ్ హోం.. హైదరాబాద్​ శివారులోని మేడిపల్లిలో ఉంది. 17 ఏండ్లుగా అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నదీ సంస్థ. 50 మంది వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతుంటారు. ఆశ్రమంలోని పిల్లలకు భోజనాలతోపాటు దీంట్లో పని చేసే ఏడుగురికి జీతాలు కలిపి ప్రతి నెలా సగటున రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది. దాతలు ఇచ్చే విరాళాలు, నిత్యావసర సరుకులతో ఆశ్రమంలో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండేది కాదు. లాక్​డౌన్​తో  సుమారు నెలన్నరగా విరాళాలు అందకపోవడంతో.. నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు పూట గడవడమే కష్టంగా మారింది. గతంలో విరాళాలు ఇచ్చిన వారిని ఫోన్​ చేసి అడుగుతున్నామని, ఎవరైనా గూగుల్  పేలో విరాళాలు ఇవ్వగానే వెంటనే కిరాణా సరుకులు కొంటున్నామని ఆర్ఫనేజ్​ నిర్వాహకుడు మోహన్​ తెలిపారు. ఇది ఒక్క అమ్మ ఒడి ఆర్ఫనేజ్ హోం పరిస్థితే కాదు.. రాష్ట్రంలోని అన్ని అనాథ ఆశ్రమాలు, దివ్యాంగుల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల పరిస్థితి ఇలానే ఉంది.