ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌ టెండర్ల వివాదం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌ టెండర్ల వివాదం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌ టెండర్ల వివాదంపై నమోదైన కేసులో హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్‌‌‌‌‌‌‌‌ వసూళ్ల ఒప్పందంలో భాగంగా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ నుంచి ప్రభుత్వానికి రూ.6,500 కోట్ల మళ్లింపు వ్యవహారం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.  ఓఆర్ఆర్  టోల్‌‌‌‌‌‌‌‌ వసూళ్లకు సంబంధించి గోల్కొండ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌ వేతో హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ మే 28న రూ. 7,380 కోట్లకు 30 ఏళ్లపాటు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య రాయితీ ఒప్పందం చేసుకుంది. దీనిని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిల్‌‌‌‌‌‌‌‌ను చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించింది. ఒప్పందం పూర్తిగా  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీకి అనుకూలంగా ఉందని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది దేశాయ్‌‌‌‌‌‌‌‌ ప్రకాశ్ రెడ్డి వాదించారు.

ప్రైవేటు కంపెనీకి మేలు జరిగేలా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ వ్యవహరించిందని ఆరోపించారు. టెండర్ ప్రకటించకుండా  ఏకపక్షంగా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం చెల్లదన్నారు.  రూ.7,380 కోట్లలో రూ.6,500 కోట్లను మళ్లించాలని  ఆదేశించడం హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ చట్టం సెక్షన్‌‌‌‌‌‌‌‌ 40కి విరుద్ధమని వెల్లడించారు. ఈ నిధులను ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ..  ప్రభుత్వానికి అనుబంధంగా హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పనిచేస్తుందని తెలిపారు. ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌ ఆదాయమంతా ప్రభుత్వానికే  చేరుతుందన్నారు. వాదనల అనంతరం కోర్టు తన విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసింది. నిధుల మళ్లింపు అంశం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని పేర్కొంది.