ఒకే ఏడాదిలో 6 పుర‌స్కారాలు.. నిరంతర నిత్య విద్యార్థిగా..చంద్రబోస్ పాటల ప్రయాణం

ఒకే ఏడాదిలో 6 పుర‌స్కారాలు.. నిరంతర నిత్య విద్యార్థిగా..చంద్రబోస్ పాటల ప్రయాణం

ఆర్ఆర్ఆర్(RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌(Chandrabose) ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాట సాధించిన అవార్డుల పరంపరలో భాగంగా చంద్రబోస్ ను సత్కరించుట కొరకు సినీ నటుడు శ్రీ ప్రదీప్ హైదరాబాద్‌ శిల్పకళావేదికలో కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని I FLY STATION ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబోస్ చాలా భావోద్వేగమైన ప్రసంగం చేశారు. 

చంద్రబోస్ మాట్లాడుతూ..ఎవరు హీరో అంటే..పాట హీరో..సంగీతం హీరో..సాహిత్యం హీరో. నా ఫస్ట్ మూవీ తాజ్ మహల్ లోని మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. తాజ్ మహల్ ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.1995లో మొదలైన నా ప్రయాణం..ఇలా 2023 వరకు కొనసాగుతుంది. ఈ 28 ఏళ్ళల్లో 800 సినిమాలకి గాను 3600 పైగా పాటలు రాశాను. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ..ఎంతో సహనంగా ఉండగలిగాను.

Also Read :- డబుల్ ఇస్మార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన 2023 సంవత్సరం ఎప్పటికీ మరిచిపోలేను.ఫస్ట్ 2023 ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, రెండవది  హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాది మొత్తంలో ఆరు అవార్డులు వరించాయి. మన తెలుగుకి భాషకు వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. మనందరం తెలుగులో పుట్టాం..తెలుగులో పెరిగాం..తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం..అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నాటు నాటు పాట రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి ఈ పాటను పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ గారికి.. అలాగే నాకెంతో ఇష్టమైన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. 

నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు.అని అన్నారు. వేదిక‌పై బోస్ తన ప్ర‌యాణానికి స‌హ‌క‌రించిన‌ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన ప్రదీప్ రుణం తీర్చుకోవాల‌ని అన్నారు.

ఈ ఈవెంట్ కి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. నిరంతరం నిత్య విద్యార్థిగా చంద్రబోస్ పాటల ప్రయాణం ముందుకు సాగాలి అంటూ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరూ కోరుకున్నారు వారిలో సినీ నటుడు మురళీ మోహన్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు ఉన్నారు.