
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ఉర్దూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా సుల్తానా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమూద్ గౌస్ పై తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని పదవి నుంచి తొలగించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత మహిళతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన ఆధారాలు లేవన్న సాకుతో ఇంతవరకు డైరెక్టర్‌ను అరెస్టు చేయలేదని ఆరోపించారు.
గత సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ జ్ఞపకార్థం సెమినార్ నిర్వహించారని , సుల్తానా సారద్యంలో ఈ కార్యక్రమం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షా 35 వేల రూపాయలను ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూఅకాడమీ ద్వారా యాభై వేలు రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదని ఆమె తెలిపారు. ఈ డబ్బు ఇవ్వాలని సుల్తానా ఉర్దూ అకాడమీకి వెళ్లగా హోటల్ లో రూముకు వస్తే అక్కడ ఇస్తానని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఆసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు.
దీనిపై గత డిసెంబర్ 23న అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని… పోలీసులు కేసు నమోదు చేసి సరైన ఆధారాలు లేవన్న సాకుతో డైరెక్టర్ ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. డైరెక్టర్‌ను అరెస్ట్ చేయాలని హజ్ భవన్ వద్ద ఆందోళన చేపట్టినందుకు బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ , ఎంఐఎం నాయకుల అండదండలతో పదవీ కాలం ముగిసిన డైరెక్టర్ గా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కితే అక్రమాకేసులు బనాయిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే అక్రమ కేసులను ఎత్తివేసి , ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.