
హైదరాబాద్ సిటీ, వెలుగు: షేక్‌పేట డివిజన్‌లోని ఓయూ కాలనీలో హైడ్రా కాల్వలను పునరుద్ధరించి వరద ముప్పు లేకుండా చేసింది. ఓయూ కాలనీలోని ఆదిత్యా నగర్, రాహుల్‌నగర్, బృందావన్, సూర్యనగర్ కాలనీల మీదుగా వెళ్లే కాలువను, మణికొండ మున్సిపాలిటీలోని ఆంబియన్స్ కోర్టు యార్డు గేటెడ్ కమ్యూనిటీ ముందు నుంచి వెళ్లే లైనుకు అనుసంధానం చేస్తూ పనులు చేపట్టారు. ఈ పనులను గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని, కబ్జాలు తొలగించి కాలువను క్లియర్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఓయూ కాలనీలో వరద ముప్పును నివారించినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ శాలువాతో సన్మానించారు. స్థానికులు బొకేలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 19లో నాలాను ఆక్రమించినట్టు ఫిర్యాదు రావడంతో రంగనాథ్ పరిశీలించారు.
హైడ్రాను అభినందించిన హైకోర్టు
పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరముందని పేర్కొంది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన వాటిని తొలగించే విషయంలో హైడ్రా అవసరముందంటూ జస్టిస్ విజయశేన్రెడ్డి వాఖ్యానించారు. జమినిస్తాన్పూర్, రామ్ నగర్ క్రాస్ రోడ్లో రోడ్డును ఆక్రమించి వాణిజ్య సముదాయం నిర్మించారు.
దీనిపై జీహెచ్ఎంసీ హైడ్రా సాయం కోరగా ఆ భవనాన్ని తొలగించింది. దీంతో వాణిజ్య సముదాయం నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కేసు గురువారం విచారణకు రాగా.. జస్టిస్ విజయశేన్ రెడ్డి హైడ్రాను ప్రశంసించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడడంపై హర్షం వ్యక్తం చేశారు.