రక్షణ కొరవడిన ఓయూ లేడీస్​ హాస్టళ్లు.. గోడలు దూకుతున్న దుండగులు

రక్షణ కొరవడిన ఓయూ లేడీస్​ హాస్టళ్లు.. గోడలు దూకుతున్న దుండగులు
  •  వరుస ఘటనలు జరుగుతున్నా వర్సిటీ అధికారుల చర్యల్లేవ్

ఓయూ, వెలుగు: కొంతకాలంగా ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్​ హాస్టళ్లలోకి  ఆగంతకులు చొరబడుతుండగా విద్యార్థినులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలు  మాత్రం పెద్దగా కనిపించడం లేదు.  తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సమయంలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్న అధికారులు ఆ తర్వాత  పట్టించుకోవడంలేదు. దీంతో తరచూ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2011 నుంచి 2024  వరకు ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పునరావృతం కాకుండా అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలేదు.  ఇక్కడ చదవాలంటేనే భయంగా ఉంటుందని, విద్యార్థులు ఓయూ క్యాంపస్​లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని విద్యార్థులు, అధ్యాపకులు అంటున్నారు.  

సాయంత్రమైతే గంజాయి బ్యాచ్​లు

 సాయంత్రం అయితే క్యాంపస్ చుట్టూ గంజాయి బ్యాచ్ లు తిరుగుతుంటాయని విద్యార్థినులు చెపుతు న్నారు. ముఖ్యంగా తమ హాస్టల్​కు ఎదురుగానే మెట్రోస్టేషన్ ​ఉండటంతో చాలామంది రాత్రి కాగానే  స్టేషన్​ మెట్లపై కూర్చుని గంజాయి తాగుతూ హాస్టల్​వైపు చూసి వెకిలి చేష్టలు చేస్తుంటారని సికింద్రాబాద్ ఓయూ హాస్టల్ విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గంజాయి బ్యాచ్​లతో తాము ఇబ్బందులు పడుతున్నామని, హాస్టల్​కు ఇరువైపులా గోడల ఎత్తును పెంచి వాటిపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నా సమస్యకు పరిష్కారం చూపడంలేదంటున్నారు.  

మొండి గోడల కారణంగా..

వర్సిటీలోని సమస్యల పేరుతో వర్సిటీ పరిపాలనా భవనంలోకి చొచ్చుకుని వస్తున్నారంటూ అధికారు లు అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్ ​చుట్టూ ముళ్ల కంచెను నిర్మించారు.  కానీ.. విద్యార్థుల హాస్టళ్ల చుట్టూ మొండి గోడలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు లేడీస్ ​హాస్టళ్లలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే అగంతకులు హాస్టళ్లలోకి వెనక వైపు ఉన్న మొండి గోడలు దూకి లోపలికి ప్రవేశించారు.  ఎత్తైన గోడ లు వాటిపైన ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఉంటే  ఇలాంటి సంఘటనలకు  తావు ఉండేదికాదని విద్యార్థులు పేర్కొంటున్నారు. హాస్టళ్ల గోడలు చాలా చిన్నగా ఉన్నాయి. వాటి ఎత్తును పెంచి ముళ్ల కంచెలు కానీ, సీస పెంకులు అమర్చాలని పలుమార్లు అధికారులను విద్యార్థినులు వేకుడున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలి

లేడీస్​ హాస్టళ్లలో రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. విద్యార్థినుల రక్షణకు భద్రత కట్టుదిట్టం చేయాలి. కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచి ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలి.  సీసీ కెమెరాలు అమర్చి అధికారులు వారానికి ఒక రోజు హాస్టళ్లను సందర్శించి సమస్యలపై విద్యార్థులతో చర్చించాలి. 

- నెల్లి సత్య, రీసెర్చ్ స్కాలర్  

గోడలు పెంచి.. ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తం

సికింద్రాబాద్​ పీజీ కాలేజీ లేడీస్ ​హాస్టల్​లో తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా సెక్యూరిటీని పెంచాం. హాస్టల్ ​చుట్టూ గోడల ఎత్తుపెంచి ముళ్ల కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం.  పది రోజుల్లో పూర్తి అవుతుంది.
 -ప్రొఫెసర్​ లక్ష్మినారాయణ, ఓయూ రిజిస్ట్రార్

తీవ్ర భయాందోళనకు గురయ్యాం

 హాస్టల్​లో జరిగిన సంఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాం. మీడియాలో చూసి తమ పేరెంట్స్​ కూడా ఆందోళనతో ఫోన్​ చేశారు. రక్షణ లేకుండా ఉన్న హాస్టల్​లో ఉండటం వద్దు. చదువు మానేసి ఇంటికి వచ్చెయ్​ అన్నారు. మరో నాలుగు నెలలు అయితే కోర్సు పూర్తవుతుంది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.

-మౌనిక, ఎంఎస్​డబ్ల్యూ ఫైనల్ ఇయర్​​