ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూం ఎదుట ఓయూ ఆశావహుల ఆందోళన

ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూం ఎదుట ఓయూ ఆశావహుల ఆందోళన
  • ఢిల్లీలో కాంగ్రెస్ ‘వార్ రూం’ ఎదుట ఓయూ ఆశావహుల ఆందోళన 
  •     టికెట్లు అమ్ముకున్నారంటూ రాష్ట్ర నేతలపై ఆరోపణలు 
  •     ఏఐసీసీ నేత జితేందర్ సింగ్ హామీతో ఆందోళన విరమణ 

న్యూఢిల్లీ, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న ఓయూ నేతలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ‘‘ఉద్యమ సమయంలో పోరాడినందుకు కేసులు మాకు.. టికెట్లు వేరేవాళ్లకా?” అంటూ వారు ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆదివారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన జీఆర్ జీ రోడ్ లోని కాంగ్రెస్ ‘వార్ రూం’ ఎదుట వారు బైఠాయించారు. ‘మాకు న్యాయం చేయండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న ఓయూ ఉద్యమ నేతల్లో మానవత రాయ్ (సత్తుపల్లి టికెట్ ఆశావహుడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), డాక్టర్ కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), పున్న కైలాష్ (మునుగోడు), కుర్వ విజయ్ కుమార్ (గద్వాల్), బాల లక్ష్మీ (జనగాం), రవి నాయక్ (దేవరకొండ) ఉన్నారు. ఇదేసమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాహనం వార్ రూం నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా.. నేతలెవరూ దారివ్వకపోవడంతో తిరిగి లోనికే వెళ్లిపోయింది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2014, 2018 ఎన్నికల్లో ఓయూ నేతలకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు10 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, కనీసం ముగ్గిరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు టికెట్లు ఉన్నాయో లేదో.. ఇప్పటికే అమ్ముకున్నారో అంటూ కుర్వ విజయ్ కుమార్ రాష్ట్ర నేతలపై ఆరోపణలు చేశారు. సీడబ్ల్యూసీ మెంబర్ జితేందర్ సింగ్ బయటకు వచ్చి నేతలతో మాట్లాడారు. అందరికీ  న్యాయం జరుగుతుందని, అయితే గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓయూ నేతలు ఆందోళన విరమించారు.   

పోటాపోటీగా బైఠాయింపు 

స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి ఫైనల్ లిస్ట్ రూపొందిస్తోందన్న ప్రచారంతో పెద్ద ఎత్తున ఆశావహులు వార్ రూం ఎదుట వాలిపోయారు. ఒక్కో నియోజక వర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు వచ్చారు. ఓబీసీ కోటా, మహిళ, ఓయూ స్టూడెంట్ల కోటా, కమ్మ కోటా, ఎన్నారై కోటా అంటూ టికెట్ల కోసం పడిగాపులు కాశారు. మీటింగ్ ప్రారంభమైన ఒక గంట పాటు సైలెంట్ గా ఉన్న నేతలు.. మధ్యాహ్నం 3 తర్వాత తమకు టికెట్ వస్తుందో, రాదో అన్న ఆందోళనలో కన్పించారు. ఓయూ స్టూడెంట్లు వార్ రూం మెయిన్ గేట్ ముందు బైఠాయించగా.. వారికి పోటీగా ఓబీసీ నేతలు రోడ్ పై కూర్చుని నిరసన తెలిపారు. బయటి పార్టీల నుంచి వచ్చే పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వద్దని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు సైతం వార్ రూం ఎదుట ఉరుకులు పరుగులు పెట్టారు. తాను ఖైరతాబాద్ సీటును కోరుతున్నట్లు మీడియా ముందు చెప్పుకున్నారు.