సంప్రదాయ వైద్యంతో కరోనాకు చెక్​

సంప్రదాయ వైద్యంతో కరోనాకు చెక్​
  •         డబ్ల్యూహెచ్​వో వెబ్​సైట్​లో ఓయూ ప్రొఫెసర్​ రామ్​ షెఫర్డ్​ వ్యాసం
  •         కరోనాపై డబ్ల్యూహెచ్​వో పబ్లిష్​ చేసిన దేశంలోనే తొలి వ్యాసంగా గుర్తింపు

హైదరాబాద్​, వెలుగు: ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ రామ్​ షెఫర్డ్​ బీనవేణికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా నివారణ, నియంత్రణకు సంప్రదాయ వైద్యమే మేలని ఆయన రాసిన వ్యాసాన్ని  డబ్ల్యూహెచ్​వో లిస్ట్​ చేసింది. దేశం నుంచి ఇప్పటిదాకా కరోనా ట్రీట్​మెంట్​పై రాసిన ఏ జర్నల్​కూ డబ్ల్యూహెచ్​వోలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఓయూ సోషియాలజీ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆయన.. ‘ఇండియాస్​ ఇండిజీనస్​ ఐడియా ఆఫ్​ హెర్డ్​ ఇమ్యూనిటీ: ది సొల్యూషన్స్​ ఫర్​ కొవిడ్​ 19’ అనే టైటిల్​తో హెర్డ్​ ఇమ్యూనిటీపై వ్యాసం రాశారు. అనాది నుంచి దేశంలో వైరస్​లు, అంటువ్యాధుల నివారణ కోసం ఎన్నెన్నో పద్ధతులు వాడేవారని అందులో పేర్కొన్నారు. సంప్రదాయ ట్రీట్​మెంట్​ పద్ధతుల్లో ఇనాక్యులేషన్, వైరలేషన్​ పద్ధతుల ద్వారా జబ్బులను నివారించగలిగారని గుర్తు చేశారు. మశూచి, చికెన్ ​పాక్స్ లాంటి వైరల్​ జబ్బుల నివారణను ప్రస్తావించారు. వైరస్​ సోకిన వ్యక్తులు లేదా జంతువుల నుంచి ప్లాస్మా, సీరమ్​ను తీసి వైరస్​ను సేకరించేవారని, దానిని అమ్మతల్లి చెట్లు ఆకుపసరులో కలపి వైరస్​ తీవ్రతను తగ్గించారని గుర్తు చేశారు. ఇలాంటి ట్రీట్​మెంట్ సింధూనాగరికత నుంచే ఉన్నాయని, గ్రామదేవతలుగా పూజించే పోచమ్మ, ముత్యాలమ్మ లాంటి వాళ్లు ఆ ట్రీట్​మెంట్​లను చేశారని పేర్కొన్నారు. ఆయన వ్యాసాన్ని చైనాకు చెందిన కేన్సర్​ అసోసియేషన్​ ప్రచురించే ట్రెడిషనల్​ మెడిసిన్​ రీసెర్చ్​ అనే ఇంటర్నేషనల్​ జర్నల్​ జూన్​లో పబ్లిష్​ చేసింది.

సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలి

దేశంలో సంప్రదాయ వైద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. పరిశోధకులకు వసతులు, గ్రాంట్స్​​ ఇవ్వాలి. విదేశీ దండయాత్రలు, ఆధిపత్య సంస్కృతి వల్ల సరైన పరిశోధనలు జరగలేదు. ప్రభుత్వాలు ఇకనైనా దృష్టిపెడితే వైద్యరంగంలో మరింత ముందుకు వెళ్తాం.

– ప్రొఫెసర్​ రామ్​​ షెఫర్డ్​