మా బార్డర్లలో నాటో టెన్షన్​ పెంచుతోంది

మా బార్డర్లలో నాటో టెన్షన్​ పెంచుతోంది

మాస్కో: ‘‘మాతృభూమి ఎప్పుడైనా పవిత్రమైనదే. దానిని కాపాడుకోవడం కోసమే ఇప్పుడు మేం పోరాటం చేస్తున్నాం. ఉక్రెయిన్​లో మా బలగాలు పోరాడుతున్నది మా దేశ భవిష్యత్తు గురించే” అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్​ పుతిన్​ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా గెలుపును పురస్కరించుకుని నిర్వహించిన విక్టరీ డే పరేడ్​లో పుతిన్​ మాట్లాడారు. అయితే 1945 విజయాన్ని ఉక్రెయిన్​ యుద్ధంతో ముడిపెట్టి మాట్లాడారు. తమ భద్రతకు సంబంధించిన డిమాండ్లను నాటో, వెస్ట్రన్​ కంట్రీస్​ పటించుకోలేదని, రష్యా మాటలను వినాలని వారు అసలు భావించడంలేదని విమర్శించారు. తమ భూభాగంలోకి చొరబడేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తమ బార్డర్ల దగ్గర నాటో ఉద్రిక్తతలు పెంచుతోందని ఆరోపించారు. విక్టరీ డే స్పీచ్​లో ఉక్రెయిన్​కు సంబంధించి పుతిన్​ కీలక ప్రకటన చేస్తారని భావించినా.. అలాంటిదేమీ లేకుండానే ఆయన ప్రసంగం ముగిసింది. వ్యూహాన్ని మార్చి ఉక్రెయిన్​పై పూర్తి యుద్ధాన్ని ప్రకటిస్తారని, లేదా సైనిక బలగాలను బలోపేతం చేసేలా రష్యా ప్రజలకు పిలుపునిస్తారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఉక్రెయిన్​లో చనిపోయిన, గాయపడిన తమ సైనికుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక డిక్రీపై ఆయన సంతకం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమరులతో పాటు ఉక్రెయిన్​లో చనిపోయిన వారికి నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. పరేడ్​లో 11 వేల ట్రూప్స్, 131 యుద్ధ వాహనాలు పాలుపంచుకున్నాయి. 11 నిమిషాల పాటు పుతిన్​ ప్రసంగం సాగింది. అయితే పుతిన్​ ఆరోపణలను ఉక్రెయిన్​ ప్రెసిడెన్షియల్​ అధికారి మిఖైలో పొడోలియాక్​ ఖండించారు. యుద్ధానికి అవకాశమే లేదని, రష్యాపై దాడి చేయాలని నాటో దేశాలు భావించడంలేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

పోలెండ్​లో రష్యా అంబాసిడర్​పై పెయింట్​తో దాడి

రష్యన్​ అంబాసిడర్​కు పోలెండ్​ లో చేదు అనుభవం ఎదురైంది. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన రెడ్​ ఆర్మీ సైనికులకు నివాళులర్పించేందుకు రష్యా అంబాసిడర్​ సెర్గీ ఆండ్రివ్​ సోమవారం పోలెండ్​లోని వార్స్వాకు వచ్చారు. అయితే ఉక్రెయిన్​కు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగిన ఆందోళనకారులు ఆండ్రివ్​పై ఎరుపు రంగు పెయింట్​తో దాడి చేశారు. తొలుత వెనుక నుంచి పెయింట్​ విసిరిన ఆందోళనకారులు ఆ తర్వాత నేరుగా ఆయన ముఖంపైనే పెయింట్​ పోశారు. రష్యా సైనికులకు నివాళులర్పించకుండా ఆయన బృందాన్ని అడ్డుకున్నారు.