మన అందాల జలపాతాలు.. జర చూసొద్దమా..!

మన అందాల జలపాతాలు.. జర చూసొద్దమా..!

పచ్చని చీరకట్టుతో అడవితల్లి!  చుట్టూ పక్షుల కిలకిలరావాలు!  జలజలపారే జలపాతపు హొయలు!  ఈ అందాలు ఎక్కడో లేవు?  మన చుట్టూనే.. తెలంగాణ అడవి తల్లి ఒడిలోనే!   పోదాం పదండి అడవికి.. జలపాతాల అందాలు చూడడానికి..  జీవితాన మిగిలిపోయె అనుభవాలు మూటగట్టుకొని రావడానికి..  

బొగత

ప్రకృతి సిద్ధమైన ఈ అందానికి ‘తెలంగాణ నయాగరా’ అని మరో పేరు. భద్రాచలం అడవుల్లోని కొండకోనల పైనుంచి జాలువారే జలపాతం ఇది. ఇది ములుగు జిల్లా  చీకుపల్లి దగ్గర ఉంది. అందుకే దీనిని ‘చీకుపల్లి జలపాతం’ అని పిలుస్తారు. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు దుంకుతదిక్కడ. దుంకిన చోట పెద్ద జలాశయం ఏర్పడింది. ఈ జలపాతం దగ్గరకు పోవాలంటే అడవిలో నడుచుకుంట పోవాలి. సెలయేర్లు దాటుతూ, అడవి జంతువులను చూస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఎగువన కురుస్తున్న వానలతో ఇప్పుడీ జలపాతం హోరుతో దుంకుతోంది. బొగతను చూసిన తర్వాత గోదావరిపై పూసూరు వద్ద ఉన్న వంతెనకు దగ్గర్లో హరిత హోటల్​లో విడిది చేయొచ్చు.

ఎట్ల పోవాలె?

బొగత జలపాతం వరంగల్ రైల్వే స్టేషన్​కు 140 కిమీ దూరంలో ఉంది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం మీదుగా చీకుపల్లి చేరుకోవాలి. అక్కడి నుంచి అడవిలో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి.

కుంతాల

తెలంగాణ కాశ్మీర్​గా చెప్పుకునే అదిలాబాద్ అడవుల్లో కుంతాల జలపాతం ఉంది.  సహ్యాద్రి పర్వతాల్లో ప్రవహించే కడెం నదిపై కుంతాల అనే ఊరికి దగ్గర్లో ఉన్నది. ఇది 45 మీటర్ల ఎత్తు నుంచి దుంకుతుంది.  జలపాతం కింద ఉన్న రాయి బల్లపరుపుగా ఉంటుంది. నీటి రాపిడికి నునుపుగా తయారైనది. ఈ గుండాలు చాలా లోతుగా ఉన్నాయి. సుడులు తిరిగే నీళ్లలో ఈదడం కూడా కష్టమే. కాబట్టి ఆడటానికి ఇది ప్రమాదకరమైనది. కుంతాలలో మూడు జలపాతాలు, మూడు గుండాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న గుహల్లో శివలింగాలు ఉన్నాయి.

ఎట్ల పోవాలె?

ఆదిలాబాద్​కు హైదరాబాద్ నుంచి రైల్‌‌‌‌‌‌‌‌, బస్​ సర్వీసులు ఉన్నాయి. ఆదిలాబాద్ కు 60 కిమీ దూరంలో కుంతాల ఉంది. అక్కడికి

ఆర్టీసీ బస్​ సర్వీసులున్నాయి.

భీముని పాదం

కొమ్ములవంచ అటవీప్రాంతంలోని ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. 70 అడుగుల ఎత్తు నుంచి దుంకే జలధార టూరిస్టుల్లో ఉల్లాసం కలిగిస్తుంది.  వరంగల్ జిల్లా నర్సంపేటకు దగ్గర్లో ఉండే బుధరావుపేట అనే ఊరి దగ్గర ఈ జలపాతం ఉంది. ఈ జలపాతానికి ‘భీముని పాదం’ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఓ కొండరాయి పాదం ఆకారంలోఉంది. అది భీముని పాదమని లోకల్స్‌‌‌‌‌‌‌‌ చెప్పుకుంటారు.

ఎట్ల పోవాలె?

వరంగల్‌‌‌‌‌‌‌‌కి 51 కిలోమీటర్ల దూరంలో  ఉంది. మూడు రూట్లలో భీమునిపాదం చేరుకోవచ్చు. నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్​కి పోయి,అక్కడి నుంచి సీతానాగారం, కొమ్ములవంచ మీదుగా పోవచ్చు. గూడూరు నుంచి చంద్రుగూడెం, లైన్‌‌‌‌‌‌‌‌ తండా. వంపు తండా మీదుగా భీమునిపాదం చేరుకోవచ్చు. కొత్తగూడెం నుంచి కోలారం, బత్తులపల్లి, గోపాలపురం మీదుగా భీమునిపాదం చేరుకోవచ్చు.

ఏడు బావుల జలపాతం 

 

బయ్యారం అడవుల్లో మిర్యాలపెంటలో సహజ సిద్ధంగా పాండవుల గుట్టపై ఏర్పడిన ఏడుబావుల జలపాతం టూరిస్టులకు కనువిందు చేస్తోంది. ఒక బావి నుంచి మరో బావిలోకి ప్రవహిస్తున్న నీటితో ఈ బావులు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. గుట్టలపై నుంచి దుంకే జలపాత ప్రవాహానికి పెద్ద బావి ఏర్పడింది. అక్కడి నుంచి కిందికి పోయే నీళ్లు దుంకిన చోట ఇంకో బావి ఏర్పడింది. ఇట్ల ఒక బావి లోంచి ఇంకో బావిలోకి దుంకుతూ పోయే ఈ జలపాతం లాంటిది ఇంకోటి లేదనే చెప్పాలి. దట్టమైన అడవిలోని రాతి కొండలపై సాగే ఈ ప్రవాహం కోతకు ఈ బావులు ఏర్పడ్డాయి. వరుసగా ఒక బావిలోంచి ఒక బావిలోకి సాగే ప్రవాహంలో మొత్తం ఏడు బావులు ఉన్నాయి. అందుకే దీనికి ‘ఏడు బావులు’ అనే పేరొచ్చింది. ఈ ఏడు బావుల్లోకి చేరే నీరు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఇప్పటికీ రహస్యమే!  ఏడు జలపాతాల్లో ఒక్కో జలపాతం సుమారు వంద మీటర్ల ఎత్తు ఉంటుంది. మొత్తం కలిపి 900 మీటర్ల ప్రయాణం ఇది! ఈ జలపాతం చూడాలంటే గుట్టలు ఎక్కక తప్పదు. ప్రవాహంతోపాటే నడవక తప్పదు.

ఎట్ల పోవాలె?

బయ్యారం నుంచి రోడ్డు మార్గం ద్వారా జగ్రావ్ పేట, కంబాలపల్లి మీదుగా మిర్యాలపెంటకు పోవాలి.  అక్కడ నుంచి కొద్ది దూరం కాలిబాటన నడుచుకుంటూ పోతే ఏడు బావులు కనిపిస్తాయి.

ఇన్ పుట్స్: అరవింద్ ఆర్య పకిడె

ఫోటో కర్టసీ: ఇందారం నాగేశ్వరరావు