
నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్
దవాఖానాల్లో అమలు
రాష్ట్రంలో జ్వరాల తీవ్రత నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రీజినల్, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓపీని నిర్వహిస్తున్నారు. ఇకపై సాయంత్రం 4 గంటల నుంచి ఆరేడు గంటల వరకు కూడా ఓపీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేగాక హాస్పిటళ్లలో అవసరమైన మందులు, మంచినీటి సౌకర్యం కూడా మెరుగుపరచాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 31 జిల్లా హాస్పిటళ్లు, 22 ఏరియా హాస్పిటళ్లు, 9 టీచింగ్ హాస్పిటళ్లలో సాయంత్రం వేళ కూడా ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.