వీ6 వెలుగు ఎఫెక్ట్: మైనారిటీ గురుకులాల్లో దిద్దుబాటు చర్యలు

వీ6 వెలుగు ఎఫెక్ట్:  మైనారిటీ గురుకులాల్లో దిద్దుబాటు చర్యలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ గురుకులాల్లో ఆ శాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. రెగ్యులర్ ఉద్యోగులైన ప్రిన్సిపాల్స్​పై పెత్తనం చలాయిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డ్యూటీలకు కత్తెర పెట్టారు. జనవరి 28న వీ6 వెలుగులో ‘మైనార్టీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం’ శీర్షికతో అకడమిక్ కో ఆర్డినేటర్లు, విజిలెన్స్ ఆఫీసర్ల ఇష్టారాజ్యంపై స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మైనార్టీ గురుకులాల సెక్రటరీ చర్యలు చేపట్టారు. విజిలెన్స్ ఆఫీసర్లకు కేటాయించిన వాహనాలను వాపస్ చేయాలని ఆదేశించారు. వెహికిల్ లేకపోవడం, తనిఖీలు నిర్వహించే అధికారం లేకపోవడంతో మెజార్టీ జిల్లాల్లో విజిలెన్స్ ఆఫీసర్లు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు సెక్రటరీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీళ్లలో ఎక్కువ మంది రిటైర్డ్ పోలీసాఫీసర్లే ఉన్నారు. అలాగే అకడమిక్ కో ఆర్డినేటర్లు చేసే డ్యూటీ కూడా రీజినల్ లెవల్ కో ఆర్డినేటర్లకు అప్పగించినట్ల తెలిసింది. 

ఉమ్మడి జిల్లాకో ఆర్ఎల్సీ నియామకం.. 

విజిలెన్స్ ఆఫీసర్లు, అకడమిక్ కో ఆర్డినేటర్ల పెత్త నానికి కత్తెర పెట్టిన నేపథ్యంలో గురుకులాల పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లాకో ఆర్ఎల్సీని నియమిస్తూ మైనార్టీ గురుకులాల సెక్రటరీ తా జాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ ఆర్ఎల్సీగా రామగుండం బాయ్స్–1 గురుకులం ప్రిన్సిపాల్. జి శ్రీధర్ ను, కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ బాయ్స్ –2 ప్రిన్సిపాల్ కె.సురేశ్​ను, వరంగల్ కు కాజీపేట గురుకులం ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ ను, ఖమ్మంకు కొత్తగూడెం గురుకులం ప్రిన్సిపాల్ అరుణకుమారిని, హైదరాబాద్ కు గోల్కొండ గురకులం ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ను, రంగారెడ్డి జిల్లాకు బాలానగర్ గురుకులం ప్రిన్సిపాల్ నిమ్మల జితేందర్ ను, నిజామాబాద్ జిల్లాకు నగరం గురుకులం ప్రిన్సిపాల్ ఎంఏ బషీర్ ను, మెదక్ కు ఆందోళ్ గురుకులం ప్రిన్సిపాల్ దివం భానుమతిని, నల్లగొండ జిల్లాకు దేవరకొండ గురకులం ప్రిన్సిపాల్ సీహెచ్. విష్ణుమూర్తిని, మహబూబ్ నగర్ జిల్లాకు మహబూబ్ నగర్ గురుకులం ప్రిన్సిపాల్ ఖాజా బాహూద్దీన్ ను నియమించారు.