బీఆర్ఎస్ బాకీ కార్డు.. కాంగ్రెస్ కు ఉరితాడు

బీఆర్ఎస్ బాకీ కార్డు.. కాంగ్రెస్ కు ఉరితాడు

సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్  సర్కార్​ వైఫల్యంపై బీఆర్ఎస్  విడుదల చేస్తున్న బాకీ కార్డు లోకల్  బాడీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఉరితాడుగా మారుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట క్యాంప్  ఆఫీస్​లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోబాకీ కార్డును రిలీజ్​ చేసి మాట్లాడారు. ఒక్కో రైతుకు రూ.75 వేలు, మహిళలకు రూ.44 వేలు ఇచ్చిన తరువాతే కాంగ్రెస్  నేతలు ఓట్లు అడగాలని డిమాండ్  చేశారు. 

అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి, ఊరూరా బెల్ట్​ షాపులు, మైక్రో బ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దసరాకు ఇండ్లకు వచ్చే వారందరికీ బాకీ కార్డు పంపిణీ చేసి కాంగ్రెస్  మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగేలా చూడాలని పిలుపునిచ్చారు. రాహుల్  గాంధీ, ప్రియాంక గాంధీ ఆరు గ్యారంటీలు, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. 

మార్పు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజలను మభ్య పెడుతూ నీళ్లు, నియామకాల విషయంలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్  సిటీకి ఆరు లేన్ల రోడ్  వేయడాన్ని పక్కన పెట్టి ముందుగా గుంతలు పడ్డ రోడ్లకు రిపేర్లు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్  ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలని సూచించారు.