పీఎఫ్ఐ కేసు..దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అరెస్ట్

పీఎఫ్ఐ కేసు..దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అరెస్ట్

దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. 10 రాష్ట్రాల్లో దాదాపు వందమందికి పైగా  పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా యూపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బీహార్  రాష్ట్రాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్, మిలిటెంట్లుగా మారేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నిషేధిత ఉగ్రసంస్థలో చేరేలా యువతను ప్రోత్సహించడం వంటి ఆరోపణపై దర్యాప్తులో భాగంగా దాడులు చేపట్టారు. 

హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలోని PFI హెడ్ ఆఫీసుకు అధికారులు సీల్ చేశారు. ఉప్పల్, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని పీఎఫ్ఐ కార్యకర్తల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. కరీంగనర్ లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. గుంటూరు లోని ఆటోనగర్ లో తనిఖీలు చేస్తున్నారు. కేరళలో 22 మందిని, కర్ణాటక, మహారాష్ట్రలో 20 మంది, తమిళనాడులో 10 మంది, అసోంలో 9 మంది, యూపీలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఏపీలో ఐదుగురు, మధ్య ప్రదేశ్ లో నలుగురు, పుదుచ్చేరి ముగ్గురు, ఢిల్లీల్లో ముగ్గురు , రాజస్థాన్ లో ఇద్దరిని అరెస్టు చేశారు. 

కేరళలో అర్ధరాత్రి నుంచే దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మలప్పురం మంజేరిలోని పీఎఫ్ఐ చైర్మన్ ఒమా సలాం నివాసాల్లోనూ దాడులు చేపట్టారు. సలాం ఇంటి ఎదుట కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. కేరళలోని వేర్వేరు చోట్ల తమ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయని పీఎఫ్ఐ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ తెలిపారు. అర్ధరాత్రి చేపట్టిన దాడులు నిరంకుశత్వానికి ప్రతీకగా నిలిచాయన్నారు.

తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పీఎఫ్ఐ పార్టీ కార్యాలయంలో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరసన చేపట్టారు. దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చెన్నై లోని పీఎఫ్ఐ హెడ్ క్వార్టర్స్ సహా.. కోయంబ్తతూరు, కడలూరు, రామ్ నాడ్, తేని, తెన్ కాశీ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

కర్ణాటకలోని మంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టారు. దాడులకు నిరసనగా మంగళూరులో PFI, SDPI  కార్యకర్తలు నిరసన చేపట్టారు. సోదాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బిహార్ లోని పూర్ణియా ప్రాంతంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

అమిత్ షా మీటింగ్

కేంద్రం హోంమత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎన్ఎస్ఏ, హోంశాఖ కార్యదర్శి, ఎన్ఐఏ డీజీ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ చేపట్టిన సోదాలు, పీఎఫ్ఐ అంశంపై చర్చించనున్నారు.