11 లక్షల మంది వలస కూలీలు మన రాష్ట్రం వదిలి వెళ్లారు

11 లక్షల మంది వలస కూలీలు మన రాష్ట్రం వదిలి వెళ్లారు
  •  పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..
    రైళ్లలో పంపింది 1.25 లక్షల మందినే
  • అరకొర ఏర్పాట్లు.. ఎన్నో కండిషన్లు..
    రైళ్లు నడపడంలో జాప్యం
  • మూటముల్లె సర్దుకుని ఇంటితొవ్వ పట్టిన మైగ్రెంట్లు
  • కనిపించిన ట్రక్కు, లారీల్లో వెళ్లిన మరెందరో కూలీలు
  • ఇప్పటికీ నడిచి వెళ్తున్న మైగ్రెంట్లు

హైదరాబాద్, వెలుగుఒక్కరో ఇద్దరో కాదు.. వందలో వేలో కాదు.. 11 లక్షల మంది వలస కూలీలు.. మూట ముల్లె మోసుకుంటూ… పిల్లజెల్ల వెంటపెట్టుకుని.. తిండితిప్పలేకుండా.. మండే ఎండల్లో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ మన రాష్ట్రం నుంచి సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఇప్పటికీ వెళ్తున్నారు.. ఒక్క కూలీ కూడా కాలినడకన వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పిన రాష్ర్ట ప్రభుత్వం తర్వాత పట్టించుకోలేదు. కేంద్రం అడిగినా.. కోర్టులు చెప్పినా కనీస ఏర్పాట్లు చేయలేదు. ఇంత జరిగాక ఇప్పుడు రవాణా ఏర్పాట్లు చేస్తామని సర్కారు చెబుతోంది!!

దారిపొడవునా.. వలస నడకలే..

రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్టు రాష్ర్ట ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి. లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో వలస కూలీలు వెళ్లకుండా సర్కారు అడ్డుకుంది. సరిహద్దులను మూసేసింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రత్యేక రైళ్లలో సొంత రాష్ట్రాలకు పంపిస్తామని మొదట్లో హామీ ఇచ్చింది. కానీ పాసులు, ప్రత్యేక రవాణా సౌకర్యాలు అందరికీ అందించడంలో విఫలమైంది. గత 20 రోజుల్లో ప్రత్యేక రైళ్లలో 1.25 లక్షల మందిని మాత్రమే సొంత ఊర్లకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అరకొర రవాణా ఏర్పాట్లు లక్షలాది మందికి రీచ్ కాలేదు. దీంతో ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని వలస కూలీలు ఆందోళనకు గురయ్యారు.

సొంత ఊళ్లకు చేరుకోవాలనే తపనతో రాత్రి పగలు కాలినడకన తమ ప్రయాణం సాగించారు. దీంతో రాష్ర్టంలోని ప్రధాన రహదారుల్లో గుంపులు గుంపులుగా తరలివెళ్తున్న మైగ్రెంట్ లేబర్లే కనిపించారు. మరోవైపు కరోనా వ్యాప్తి భయంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఆపేందుకు, సరిహద్దులను మూసి ఉంచేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో రోజురోజుకు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.

మన రోడ్లపై కోటిన్నర మంది వెళ్లిన్రు

ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుకుంటూ తెలంగాణ గుండా వెళ్లే నేషనల్ హైవే 44పై రోజూ లక్షలాది మంది నడస్తూ సొంత ప్రాంతాలు వెళ్లారు. ఇప్పటిదాకా దాదాపు కోటిన్నర మంది వలస కూలీలు నడుచుకుంటూ రాష్ట్ర సరిహద్దులు దాటారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన హైవేలపై, రైలు పట్టాలపై నడస్తూ  వెళ్లిపోయారు. లారీలు, ట్రక్కులకు సడలింపులు ఇవ్వడంతో కొందరు కూలీలు అందులో అవస్థలు పడతూ  ప్రయాణించారు.

చేతులెత్తేసిన సర్కారు

వలస కూలీలు కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను నిర్వహించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శలు ఉన్నాయి. అక్కడ కనీస  సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు తమ సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్లిపోయారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన కొత్తలో వలస కూలీల కోసం దాదాపు 100 శిబిరాలను హైదరాబాద్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రెండో దశ లాక్ డౌన్ లో మెజార్టీ మైగ్రెంట్లు అక్కడ ఉండేందుకు సుముఖంగా లేకపోవడంతో ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ ఉంది. కనీసం నేషనల్ హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్న వారికి ఆకలి తీర్చేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. స్థానిక అధికారులు ప్రభుత్వానికి చాలా సార్లు లెటర్లు రాసినా స్పందన రాలేదని తెలిసింది. ఇలా వెళ్తున్న కూలీలను ఆదుకునేందుకు కొన్నిచోట్ల స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అండగా నిలిచారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి అన్నం పాకెట్లు, నీళ్లను అందజేశారు.

సవాలక్ష కండిషన్లు

సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మైగ్రెంట్లకు ప్రభుత్వం అనేక రకాల కండిషన్లు పెట్టింది. స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి ఆధార్ కార్డు చూపించి, ఊరు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ఎప్పుడు ట్రైన్ ఉంటుందో చెప్పేవరకు అక్కడే ఉండాలి. దరఖాస్తు చేసిన నాలుగైదు రోజుల తర్వాత ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైళ్లు నడపడంలో కూడా తీవ్రంగా జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత 21 రోజుల్లో కేవలం 88 రైళ్లను మాత్రమే సర్కారు నడిపింది. మే 1న లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్​కు నడిపిన తొలి శ్రామిక్​ రైలులో 1200 మంది కూలీలను పంపారు. రోజుకు నాలుగైదు రైళ్ల చొప్పున బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిసా రాష్ట్రాలకు తరలించారు.

ఇంకా నడుస్తున్నారు

రాష్ట్ర రహదారుల గుండా ఏ ఒక్క వలస కూలీ నడవొద్దని, వారికి కావాల్సిన రవాణా సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించారు. కానీ ఆ తర్వాత కూడా.. శుక్రవారం సాయంత్రం వరకు నేషనల్ హైవే 44 నుంచి దాదాపు 5 వేల మంది నడుచుకుంటూ రాష్ట్ర సరిహద్దులు దాటిపోయారని ఎన్జీవో సభ్యులు, స్థానికులు చెబుతున్నారు.

దేశంలో కొత్త కేసులు 6,591