మిస్సింగ్ ఫోన్లు దొరుకుతున్నయ్ .. సీఈఐఆర్ ద్వారా స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

మిస్సింగ్ ఫోన్లు దొరుకుతున్నయ్ .. సీఈఐఆర్ ద్వారా స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
  • రామగుండం కమిషనరేట్ పరిధిలో 6,686 మిస్సింగ్, థెఫ్ట్ కంప్లైంట్స్ 
  • ఇప్పటివరకు 2,120 ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అప్పగింత 
  • రికవరీకి స్పెషల్ టీంలు 

మంచిర్యాల, వెలుగు: మీ మొబైల్ ఎక్కడైనా మిస్సయిందా? లేక ఎవరైనా దొంగిలించారా? అయితే టెన్షన్ పడకండి. వెంటనే సీఈఐఆర్​కు కంప్లైంట్ చేయండి చాలు.. మీ ఫోన్ ఎక్కడున్నా, ఎవరు చోరీ చేసినా పోలీసులు వెతికి పట్టుకుంటారు. స్వాధీనం చేసుకుని మీకు అప్పగిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2 వేలకు పైగా ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కమిషన రేట్ పరిధిలో చోరీకి గురైన 120 మొబైల్స్​ను రికవరీ చేసి గత నెల 25న మేళా నిర్వహించి బాధితులకు సీపీ అంబర్ కిశోర్ ఝా చేతుల మీదుగా అప్పగించారు. 

అందుబాటులోకి సీఈఐఆర్ 

కాల్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, యూట్యూబ్, నగదు చెల్లింపులతో మొబైల్​మన నిత్య జీవితంలో భాగమైంది. అరచేతిలో ప్రపంచాన్ని మన కండ్లముందు ఉంచే సెల్‌‌ఫోన్‌‌ ఎక్కడైనా మిన్సయినా లేదా చోరీకి గురైనా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ క్రమంలో మిస్సింగ్ ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ సెంట్రల్‌‌ ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌‌ఫోన్‌‌ను గుర్తిస్తున్నారు.

ఫిర్యాదు ఇలా..

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ముందుగా సీఈఐఆర్‌‌కు కంప్లైంట్ చేయాలి. ఆ వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లగానే.. రిక్వెస్ట్‌‌ ఫర్‌‌ బ్లాకింగ్‌‌ లాస్ట్‌‌, స్టోలెన్‌‌ మొబైల్‌‌ లింక్‌‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌‌ చేయాలి. అందులో సెల్‌‌ఫోన్‌‌కు సంబంధించిన 15 డిజిట్స్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్​మెట్ ఐడెంటిటీ) నంబర్‌‌, కంపెనీ పేరు, మోడల్‌‌ పేరు బిల్లులను వెబ్‌‌సైట్‌‌లో నమోదు చేయాలి. తర్వాత ఓటీపీ కోసం మరో సెల్‌‌ఫోన్‌‌ నంబర్‌‌ ఇవ్వాలి. ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుడి ఐడీ నంబర్‌‌ వస్తుంది. అనంతరం ఆ మొబైల్​ను పనిచేయకుండా చేస్తుంది. ఏ కంపనీ సెల్‌‌ఫోన్‌‌ అయినా సీఈఐఆర్‌‌ ఫోర్టల్‌‌లో నమోదు చేయగానే బ్లాక్ అవుతుంది. ఇక దాన్ని ఎవరూ వినియోగించలేరు. దీంతోపాటు ఫోన్‌‌ ఎక్కడ ఉందనే వివరాలు పోలీస్ డిపార్ట్​మెంట్​లోని ఐటీ సెల్​కు అందిస్తుంది. 

2,120 ఫోన్లు రికవరీ 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్, ఐటీ సెల్ ఆధ్వర్యంలో మిస్సింగ్, థెఫ్ట్ పోన్లను రికవరీ చేసేందుకు స్పెషల్ టీంలు పనిచేస్తున్నాయి. అంతేగాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు సీఈఐఆర్ పోర్టల్​లో 6,683 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 2,120 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని యజమానులకు అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన ఎల్తూరి అశోక్ జూన్ 21న యోగా డే వేడుకలకు వెళ్లినప్పుడు తన ఒప్పో ఫోన్ మిస్సయింది. 

వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైట్ ఫైల్ చేశాడు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి ఫోన్ దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం మొబైల్​ను స్వాధీనం చేసుకొని తిరిగి అశోక్​కు అప్పగించారు. ఇలా మంచిర్యాల హమాలివాడకు చెందిన గొల్లపల్లి కనకయ్య, సీసీసీ నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన గాజుల హరీశ్, కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన పి.వినయ్, మంచిర్యాల జాఫర్ నగర్​కు చెందిన నరేశ్​తో పాటు మంచిర్యాల రాంనగర్​కు చెందిన మాటేటి కృష్ణ ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి వారికి అప్పగించారు.