
- ఈ దేశాల్లోని 60 శాతం కంపెనీలకు ఆసక్తి.. వెల్లడించిన స్టాండర్డ్ చార్టర్డ్
న్యూఢిల్లీ: అమెరికా, యూకే, చైనా, హాంగ్‌కాంగ్‌లోని 60 శాతానికిపైగా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడయింది. స్టాండర్డ్ చార్టర్డ్ ఇటీవల విడుదల చేసిన 'ఫ్యూచర్ ఆఫ్ ట్రేడ్: రెజిలియెన్స్' రిపోర్ట్ ప్రకారం, చాలా కంపెనీలకు భారత్ ప్రధాన మార్కెట్‌గా మారుతోంది.
సుంకాల వంటి సమస్యలతో పాటు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, ఆర్థిక వృద్ధి వీటికి కీలకంగా మారాయి. ఈ సర్వే 17 ప్రధాన మార్కెట్‌లు, నాలుగు పరిశ్రమలలోని 1,200 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి అభిప్రాయాలను సేకరించింది. దాదాపు సగం మంది రెస్పాండెంట్లు భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలను పెంచాలని లేదా కొనసాగించాలని కోరుకుంటున్నారు. ప్రతి ఐదు కంపెనీలలో రెండు కంపెనీలు దేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొనసాగించడానికి రెడీగా ఉన్నాయి.
యుఎస్, యూకే, మెయిన్‌ల్యాండ్ చైనా, హాంకాంగ్ కార్పొరేట్లు భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. సమర్థతను పెంచడానికి పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి క్లయింట్లు తమ గ్లోబల్ ట్రేడ్, సరఫరా గొలుసు వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని స్టాండర్డ్ చార్టర్డ్ సీనియర్ఎగ్జిక్యూటివ్ సునీల్ కౌశల్ చెప్పారు. స్మార్ట్ తయారీ, ఏఐని వేగవంతం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో ఆసియా ప్రపంచ వాణిజ్య వృద్ధిని కొనసాగిస్తుందని, యూఎస్ హవా కొనసాగుతుందని కార్పొరేట్ లీడర్లు భావిస్తున్నారు.