
యూపీలోని బోలేబాబా సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించింది యోగీ సర్కార్. ఈ కమిటీ ప్రాథమిక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. అసలు తొక్కిసలాటకు కారణం ఏంటో తెలుసా.. జనం ఎక్కువగా వచ్చారు.. అంచనాకు మించి వచ్చారు.. అందుకే తొక్కిసలాట జరిగింది.. భక్తులు చనిపోయారు అంటూ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది కమిటీ..
అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా) అనుపమ్ కులశ్రేష్ఠ, అలీఘర్ డివిజనల్ కమీషనర్ చైత్ర ఇచ్చిన నివేదికలో 128 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇందులో భోలే బాబా అని ప్రసిద్ధి చెందిన నారాయణ్ సకర్ హరి సత్సంగంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో సహా పలువురిని విచారించారు. ఈ నివేదికను రాష్ట్ర హోంశాఖకు సమర్పించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ నివేదికను పరిశీలించే అవకాశం ఉంది.
సత్సంగ్ నిర్వాకులు 80 వేల మంది వ్యక్తులకు అనుమతి కోరగా.. 2.5 లక్షల మంది ప్రజలు వచ్చారని రిపోర్టులో తెలిపారు. జులై 2న జరిగిన ఈ వెంట్ లో తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.. ఈ వెంట్ ప్రధాన నిర్వాహకుడు దేవప్రకాష్ మధుకర్ సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
భోలె బాబా( నారాయణ్ సకర్ హరి) ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనలేదు. తొక్కిసలాట జరిగినప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అయితే బోలే బాబా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
ఈవెంట్ లో బోలెబాబా వెళుతున్నప్పుడు తొక్కిసలాట జరిగింది కొంతమంది కిందపడిపోయారు. దీంతో గందరగోళంలో చాలా మంది జారి కిందపడ్డారు. వారి పై నుంచి మైదానం వైపు బయటకు పరుగులు తీయడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.