సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్వహిస్తున్న రైతు మేళాకు అనూహ్య స్పందన వస్తోంది. పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న రైతు మేళాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివస్తూ స్టాళ్లను పరిశీలిస్తున్నారు.
మేళా మొదటి రోజైన శుక్రవారం సుమారు ఐదు వేల మంది రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతిక పనిముట్లతో పాటు ఇతర అంశాల గురించి అధికారులు, కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో భాగంగా పామాయిల్ సాగుతో పాటు ఇతర అంశాలపైనా ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి దిగుబడి, అంతర పంటల సాగు, కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయం పొందడం ఎలా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రైతు మేళా మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.
ఆకట్టుకుంటున్న స్టాళ్లు
రైతు మేళా ప్రాంగణంలో వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, ఇరిగేషన్, మార్క్ ఫెడ్, మత్స్యశాఖల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఆయిల్‌పామ్ సాగు వల్ల కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే వ్యవసాయంలో ఏఐని ఉపయోగించే విధానాన్ని వివరించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
మొబైల్ యాప్ ద్వారా ఆకు, నేల సమాచారంతో పాటు వాతావరణ హెచ్చరికలు, ఉరుములు, మెరుపుల సమాచారం కూడా తెలుసుకోవచ్చని వివరిస్తున్నారు. అలాగే తేనెటీగల పెంపకం, పవర్‌వీడర్, నాటు వేసే మెషీన్, దేశవాళీ పశువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రైతులు సందర్శించి అవసరమైన వివరాలు తెలుసుకుంటున్నారు.
