
హైదరాబాద్ : రాజస్థాన్ పోలీసుల తీరుపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. 2017 మూకదాడి కేసులో పెహ్లాఖాన్, అతడి ఇద్దరు కొడుకులపై చార్జిషీట్ దాఖలు కావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది అణచివేత అని ఆయన ఆరోపించారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లింలు మద్దతు ఉపసంహరించాలని ఆయన కోరారు.
“కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మైనారిటీ సంక్షేమం అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అది ఫక్తు బీజేపీ ఫార్ములాను అనుసరిస్తోంది. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఈ సంఘటన. 2017 అల్వార్ లో పెహ్లూఖాన్ పై దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ ఆ సంఘటనను ఖండించింది. కానీ.. అధికారంలోకి వచ్చాక అశోక్ గెహ్లాట్ పద్ధతిలో మార్పు వచ్చింది. ముస్లింలను కాంగ్రెస్ ఇప్పటికే మోసం చేసింది. రాజస్థాన్ కాంగ్రెస్ కు మద్దతివ్వకండి. బీజేపీకి మారుపేరుగా కాంగ్రెస్ తయారయ్యింది. బీజేపీ చేసే పనిని కాంగ్రెస్ చేస్తోంది” అని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ.