కలెక్టర్ చెప్పినా తెరుచుకోని ప్రైవేట్ ఆస్పత్రులు

కలెక్టర్ చెప్పినా తెరుచుకోని ప్రైవేట్ ఆస్పత్రులు

ఇప్పుడు ఏ నోట విన్నా.. ఎక్కడ చూసినా.. కరోనా.. కరోనా.. కరోనా..!! ఈ సమయంలో సేవలందిస్తోంది కేవలం పోలీసు, హెల్త్, పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ ఆసుప్రతిలో ఎక్కువగా కరోనా పేషెంట్లకే కేటాయిస్తున్నారు. దీంతో ఓపీ చూడడానికి ఎవరూ ఉండటం లేదు. ప్రైవేటు ఆస్పత్రులేమో తాళాలు వేసి కనిపిస్తున్నాయి. దీంతో ఎటుపోవాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల కలెక్టర్ కూడా ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై మండిపడినట్లు సమాచారం. విపత్కర పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు వైద్య సేవలు అందకపోవడం విచారకరం.

కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్. ఇక్కడ సుమారు 300 వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. నిత్యం వేలాది మంది వివిధ వ్యాధులతో పరీక్షల కోసం వస్తుంటారు. ఇక్కడ మందుల అమ్మకాలే రోజుకు సుమారు ఐదు కోట్ల వరకు ఉంటాయి. అలాంటిది ప్రస్తుతం కొన్ని  కార్పొరేట్ ఆసుపత్రులు మినహా.. ఎక్కడా దవాఖానాలు తెరిచి ఉండటం లేదు. లాక్‍డౌన్‍ కారణంగా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ  మూతపడ్డాయి. నిత్యం రోగులతో కిటకిటలాడుతూ కనిపించే ఈ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఎవరూ కనిపించడం లేదు. కరీంనగర్‍లోని డాక్టర్‍ స్ట్రీట్‍, మంచిర్యాల చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ పరిసరాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిని తెరవకపోవడం వల్లనే రోగులు రావడం లేదా.. లేక తెరిస్తే ఎక్కడ రోగులు వస్తారోనని భయపడి ఆసుపత్రులు తీయడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

90 శాతం తాళాలే…!

కరీంనగర్ నగరంలో పది వరకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రం తెరిచి ఉంచారు. మిగిలినవి ఎక్కడ తెరిచి లేవు. మార్చి 22 నుంచి లాక్ డౌన్  ప్రకటించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతకంటే ముందు నుంచే కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మార్చి 16 నుంచి నగరంలో ఇండోనేషియా వాసులు రావడం.. ఇందులో పదిమందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో అధికారులు సైతం నగరంలో అప్రమత్తం చేశారు. పరిస్థితులు ఎలా ఉంటాయోనని ముందస్తుగానే ప్రైవేట్ ఆసుపత్రులు సర్దుకున్నాయి. లాక్ డౌన్ సాకుగా చెప్పుకొని ఆసుపత్రులకు తాళాలు వేశారు. ఆసుపత్రులకు విచ్చలవిడిగా రోగులు వస్తే.. ఇందులో ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నాయో పసిగట్టలేమని చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రులు తెరుచుకోవడం లేదు. దీంతో అత్యవసర సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కలెక్టర్ చెప్పినా..

లాక్ డౌన్ పెట్టి సుమారు 20 రోజులు కావస్తోంది. ఇన్ని రోజులుగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కడా తెరుచుకోలేదు. దీంతో నగరవాసులు రోగుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అవి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే కలెక్టర్ శశాంక నగరంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు ఎందుకు తెరవడం లేదు.. దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ ఆస్పత్రులకు మినహాయింపు ఉందని.. ప్రజలకు వైద్య సేవలందించాలని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అయినా రకరకాల సాకులతో ఆసుపత్రులు తెరవడానికి వైద్యులు ముందుకురావడం లేదు.

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోవిడ్‌‌‌‌‌‌‌‌ 19 శాంపిల్ కలెక్షన్ సెంటర్

కరీంనగర్‍ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కోవిడ్‌‌‌‌‌‌‌‌19 శాంపిల్‍ కలెక్షన్‍ సెంటర్‍ (క్యాబిన్‍) ఏర్పాటు చేశారు. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శాంపిల్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను నియమించనున్నారు. అనుమానితుడి గొంతు, ముక్కులో నుంచి తడిని తీసేటప్పుడు ఇతరులకు సోకకుండా ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేశారు. కేబిన్‍ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి ఇతరులు ఎవరూ వెళ్లకుండా అన్నిదారులూ బారికేడ్లతో మూసివేశారు. సేకరించిన శాంపిల్స్ను సీసాలో భద్రపరిచి ల్యాబ్‍కు పంపిస్తారు.

స్పెషలిస్టులు ఎక్కడ..?

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మినహా.. ఎక్కడా స్పెషలిస్టులు కనిపించడం లేదు. దీనివల్ల ముఖ్యంగా కంటి, పంటి, చెవి ముక్కు గొంతు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్పెషలిస్టులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఎక్కువగా కరోనా పేషెంట్లను చూస్తుండడమే ఇందుకు కారణం. అసలే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ముఖ్యంగా జనరల్ ఫిజీషియన్లు, ఈఎన్టీ వైద్యులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నిపుణులు అందుబాటులో ఉండాలి. సాధారణ ప్రజలకు ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్కానింగ్‌‌‌‌‌‌‌‌లు,  ఎక్స్ రేలు తీయాల్సి ఉంటుంది. కానీ వీరెవరూ అందుబాటులో లేరు.