యూత్​కు ప్యాకేజీలు.. సంఖ్యను బట్టి లక్ష దాకా క్యాష్ ఆఫర్లు

యూత్​కు ప్యాకేజీలు.. సంఖ్యను బట్టి లక్ష దాకా క్యాష్ ఆఫర్లు
  • గెలిస్తే గోవా, బ్యాంకాక్ పంపిస్తామని అగ్రిమెంట్లు
  • ఇప్పటికే చాలా చోట్ల అడ్వాన్సులు ఇచ్చిన లీడర్లు

హనుమకొండ, వెలుగు:పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. నేతలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నవాళ్లు చేజారిపోకుండా జాగ్రత్త పడుతూనే, పక్క పార్టీల నుంచి చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో రూలింగ్ పార్టీ లీడర్లు ఒకడుగు ముందుకేసి మనీ, టూర్ ప్యాకేజీల పేరుతో యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. సంఖ్యని బట్టి రూ.లక్ష దాకా ప్యాకేజీలు ఇస్తున్నారు. ఎన్నికల ముందు కొంత అడ్వాన్స్ ముట్టజెప్పి, గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉద్యోగాలు, పేపర్​ లీకేజీల విషయంలో అసంతృప్తిగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు ఈ ప్యాకేజీలు పనికి వస్తాయని భావిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు సరిగా ఇవ్వకపోవడం, ఇచ్చినవాటి క్వశ్చన్ పేపర్లు లీకేజీ, నిరుద్యోగ భృతి హామీ అమలుచేయకపోవడం.. ఇలా వివిధ కారణాలతో యువత అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ వచ్చాక జాబ్ క్యాలెండర్ వేసి, ఏ యేడాది ఖాళీలు ఆ ఏడాది భర్తీ చేస్తారని యువత ఆశించినా అది జరగలేదు. తొమ్మిదేండ్లలో ఒక్కసారి కూడా గ్రూప్​వన్ నోటిఫికేషన్​వేయని సర్కారు, ఎన్నికల ముందు వేసినా పేపర్​లీకేజీల వల్ల రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఓట్ల కోసమే హడావిడిగా వేసిన మిగిలిన నోటిఫికేషన్లు కూడా వివిధ దశల్లో అర్ధంతరంగా ఆగిపోయాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ల కింద గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన స్వయం ఉపాధి రుణాలు కూడా కొన్నేండ్లుగా ఆగిపోయాయి. దీంతో సొంత కాళ్లపై నిలబడాలని భావించే యూత్​దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కానీ నిన్న మొన్నటి దాకా యూత్​ను అంత సీరియస్​గా తీసుకోని బీఆర్ఎస్ పెద్దలు.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​హవా వీస్తుందనే టాక్​తో అలర్ట్ అయ్యారు. ప్రతి ఓటు కీలకంగా మారడంతో యూత్​వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో యువకులను మంచి చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్యాకేజీలు అందజేస్తున్నారు. నియోజకవర్గాల్లో యూత్ కోసమే ప్రత్యేకంగా ఇన్ చార్జులను నియమించి మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు.

రూ. లక్ష దాకా ప్యాకేజీలు

నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న మీటింగుల్లో యువజన సంఘాలకు స్పెషల్​ప్యాకేజీలు ఆఫర్​చేస్తున్నారు. సభ్యుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్​చేసి 20 నుంచి 30 శాతం దాకా అడ్వాన్స్​ చెల్లిస్తున్నారు. గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉదాహరణకు హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి గ్రామాల్లోని యువకులు పెద్దసంఖ్యలో కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాలకు క్యూ కడ్తున్నారు. మొదట భయపెట్టినా, బెదిరించినా ఫలితం లేకపోవడంతో బుజ్జగిస్తున్నారు.

ALSO READ : ఖమ్మం జిల్లాలో 30 నామినేషన్ల తిరస్కరణ

హసన్ పర్తి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు 10 నుంచి15 మంది గల ఒక్కో గ్రూపుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా చెల్లించారు. కాగా,100 మంది, ఆపైన యువతను పార్టీలో చేర్పించే యువనేతలను గోవా, థాయ్​లాండ్​టూర్లకు తీసుకెళ్తామని ఆశచూపుతున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా రాసుకుంటున్నారు.