ప్రభుత్వ భూమిలో చేలు, చేపల చెరువులు

ప్రభుత్వ భూమిలో చేలు, చేపల చెరువులు
  • కీరోల్ పోషిస్తున్న అధికార పార్టీ నేత
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు
  • భూములను కాపాడాలంటున్న గ్రామస్తుల

పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వ భూములు యథేచ్చగా కబ్జా చేసి, దర్జాగా సాగుచేసుకుంటున్నరు. అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు ఉంటున్నరు. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకుంటలేరు. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామ పంచాయతీ పరిధి గట్టు సింగారం గుట్టల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. ఈ ఆక్రమణలో అధికార పార్టీకి చెందిన నేత కీ రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. గుట్ట మీద దాదాపు 8 ఎకరాల పైచిలుకు భూమిని కబ్జా చేసి పత్తి సాగు చేస్తున్నారు. చేపల పెంపకానికి చెరువులు చేసుకున్నారు. గట్టుసింగారం శివారులోని సర్వే నంబర్లు 31, 32, 3Zలో గతంలో కొంత భూమిని ప్రభుత్వం పేదలకు పంచింది. దాన్ని ఆధారంగా చేసుకొని అవే సర్వే నంబర్లలో ఉన్న మిగతా భూమిని అధికార పార్టీ లీడర్, అతని బంధువులు, అనుచరులు ఆక్రమించుకున్నారు. అడవిగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసి సాగు చేస్తున్నారు. దీంతో 2021 నుంచి స్థానికులు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

పర్యాటక కేంద్రం ప్రకటనతోనే..

గట్టు సింగారం గుట్టలో ఐదేళ్ల క్రితం వాటర్ ఫాల్స్​ను గుర్తించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో సర్కార్ ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. క్రమంగా సందర్శకులు పెరగడంతో మెయిన్ రోడ్డు నుంచి వాటర్ ఫాల్స్ వరకు జీపీ ఆధ్వర్యంలో మట్టి రోడ్డు వేయించారు. కొద్ది రోజులు ఇక్కడ టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు అధికార పార్టీ లీడర్ల కండ్లు వాటర్ ఫాల్స్​ సమీప భూములపై పడ్డాయి. అనంతరం కొందరు 31,32, 3జడ్ సర్వే నంబర్​లో ఉన్న భూములు ఆక్రమించుకొని సాగుచేస్తూ, చేపల చెరువులు తవ్వుకున్నారు. 

పాత ఆధారాలే ఆయుధాలు..

గ్రామంలోని భూముల పాత ఆధారాలు, వారి పూర్వీకుల సమాచారం తెలుసుకుని, బినామీలను సృష్టించి, అధికారుల అండతో ప్రభుత్వ భూములను ఈజీగా సొంతం చేసుకుంటున్నారు. సర్వే నంబర్ 32లో సబ్బితంకు చెందిన ఇద్దరిని ప్రభుత్వం పేదలుగా గుర్తించి 33 గుంటల చొప్పున భూమిని పంపిణీ చేసింది. ఆ భూమిని అసైన్డ్ చేసి లావోని పట్టాలిచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని సర్వే నంబర్ 31, 32, 3Z లలో 4.24 ఎకరాలు, 33 గుంటలు, 1.10 ఎకరాల చొప్పున మొత్తం 6.27 ఎకరాలు కబ్జా చేశారు. విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేక పోవడంతో అదే గ్రామానికి చెందిన స్వచ్చంద సంఘాల సభ్యులు కబ్జా అయిన భూమికి సంబంధించి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2020లో విచారణ చేసిన అధికారులు ఫిర్యాదులోని సర్వే నంబర్లు 31,32, 3Z లు పూర్తిగా  ప్రభుత్వ భూమిగా గుర్తించారు.  అందులోని  6. -27 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు తేల్చారు. డిసెంబర్ 7, 2021లో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇంత చేసినా అధికారుల విచారణ, పంచనామా అంతా పేపర్లకే పరిమితమైంది. ఇప్పటికీ ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. దీంతో ఈనెల 21న మరోసారి కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై విచారణ చేయిస్తామని అడిషనల్ కలెక్టర్​ఈ సందర్భంగా చెప్పారు. 

ఎంక్వైరీ చేస్తున్నాం

సబ్బితం గ్రామ పంచాయతీ పరిధి గట్టు సింగారంలోని పలు సర్వే నంబర్లలో భూములు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు వచ్చింది. దానిపై విచారణ చేస్తున్నాం. భూములు ఆక్రమణకు గురైతే వాటిని స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారులపై కేసు పెడుతాం.

- సుధాకర్, తహసీల్దార్, పెద్దపల్లి