సన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు 

సన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు 
  • మన రాష్ట్ర మిల్లర్లతోపాటు కర్నాటక, ఆంధ్రా నుంచి రాక
  • కల్లాల వద్దనే పచ్చి వడ్లనూ కొంటున్న వ్యాపారులు 
  • బియ్యం రేట్లు పెరుగుతాయని పెద్ద ఎత్తున వడ్ల సేకరణ  

నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో సన్న వడ్లకు మస్తు డిమాండ్ పెరిగింది. నిజామాబాద్ లో కోతలు మొదలవుడే ఆలస్యం.. వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ మిల్లర్లు క్యూ కడ్తున్నారు. కర్నాటక, ఆంధ్రా నుంచి వస్తున్న మిల్లర్లు.. క్వింటాల్ కు రూ.2,300 చొప్పున పెట్టి, కల్లాల వద్దనే వడ్లు కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని రంగారెడ్డి, మెదక్,  మంచిర్యాల, నల్గొండ జిల్లాల నుంచి కూడా మిల్లర్లు వస్తున్నారు. ఎలాంటి తరుగు లేకుండా పచ్చి వడ్లకే ఇంత రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు కూడా ఆనందంతో కోతలు స్పీడప్​ చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కొద్ది రోజుల్లోనే ఏకంగా 2 లక్షల టన్నుల వడ్లను ప్రైవేట్ మిల్లర్లు కొనడం విశేషం. కాగా, సన్న బియ్యం రేట్లు పెరిగే అవకాశం ఉందని మిల్లర్లు సన్నోడ్లు కొనేందుకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొదలయ్యేలోపు వీలైనంత మేర వడ్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే 35 శాతానికి మించి తేమ ఉన్న వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. 

ఊపందుకున్న కోతలు..

నిజామాబాద్​జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్​లో 4.12 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్న రకాలు 3.50 లక్షల ఎకరాల్లో ఉండగా, 11.56 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం దిగుబడిలో 8 లక్షల టన్నుల ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్​, బాన్సువాడ నియోజకవర్గాల్లో వరి నాట్లు ఇతర ప్రాంతాలకంటే ముందే వేస్తారు. ఇక్కడ పంట కోతలు సెప్టెంబర్ ఆఖరు వారంలో మొదలవుతాయి. కోతలు మొదలవుడే ఆలస్యం.. పక్క రాష్ట్రాల మిల్లర్లు వచ్చి కొనుగోళ్లు మొదలుపెట్టారు.

సన్నొడ్లు అయితే చాలు తేమతో సంబంధం లేకుండా పచ్చివి కూడా సేకరిస్తున్నారు. బోధన్, వర్ని, కోటగిరి, పోతంగల్, రుద్రూర్, చందూర్, మోస్రా, సాలూరా మండలాల్లో లోకల్​ దళారులను నియమించుకుని క్వింటాల్ కు రూ.50 చొప్పున కమీషన్ ఇస్తూ కాంటాలు పెడుతున్నారు. గత 25 రోజుల నుంచి దాదాపు 2 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. కర్నాటక, ఆంధ్రా నుంచి వచ్చిన మిల్లర్లు మొదట్లో రూ.2,500 రేటు పెట్టి స్పాట్ లోనే కొన్నారు. ఈ ధర రైతుల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో వడ్లు అమ్మేందుకు రైతులు పోటీ పడ్డారు. దీంతో మిల్లర్లు ఇప్పుడు రూ.2,300 చెల్లిస్తున్నారు. క్వింటాల్​కు ఖాళీ బస్తా కలిపి 3 కిలోల తరుగు మాత్రమే తీస్తున్నారు.

రూ.2,300కు అమ్మిన

25 ఎకరాల్లో సన్నాలు సాగు చేశాను. అందులో 20 ఎకరాలు కోతకు రావడంతో మిషన్ పెట్టి కోయించాను. క్వింటాల్​కు రూ.2,300 చొప్పున ధర చెల్లించి మంచిర్యాలకు ఒకటి, ఆంధ్రాకు ఒక లారీ లోడ్ వడ్లను మిల్లర్లు తీసుకెళ్లారు. వడ్లు ఎండబెట్టే బాధ తప్పింది. లాభసాటి రేటు దక్కింది.  

- పందిముక్కుల శ్రీనివాస్, రైతు, కోటగిరి 

పదెకరాల్లో వేసిన.. 

పదెకరాల్లో సన్నాలు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వచ్చింది. సర్కారు కాంటాలు పెట్టేదాకా ఆగుదామనుకున్న. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన మిల్లర్లు ఎక్కువ ధరకే కొంటున్నారని తెలిసి వాళ్లను కలిసిన. క్వింటాల్ కు రూ.2,200 పెట్టి కొనుగోలు చేశారు. పచ్చి వడ్లనే కొన్నారు కాబట్టి లాభమే.  

- మలావత్​ నగేశ్, ఊట్​పల్లి

ఇదే మేలని రైతుల మొగ్గు.. 

ఈ ఏడాది ప్రభుత్వం స్వల్పంగా వడ్ల మద్దతు ధరలు పెంచింది. దొడ్డు రకాలకు రూ.2,203గా, సన్నాలకు రూ.2,183గా ప్రకటించింది. 17 శాతం తేమను అనుమతిస్తూ జరిగే కొనుగోళ్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. పైగా డబ్బుల కోసం ఎదురు చూడాలి. ఇప్పుడున్న వాతావరణంలో కోసిన వడ్లు ఆరబెట్టడానికి ఐదు రోజుల వ్యవధి తీసుకున్నా, ఎకరం వడ్లకు నలుగురు కూలీలను నియమించాలి. ఒకరికి రూ.500 చొప్పున చెల్లించినా రైతులపై వడ్లు ఆరబెట్టే భారం రూ.10,000 అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ మిల్లర్ల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.