వడ్లు కాంటా పెడ్తలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

వడ్లు కాంటా పెడ్తలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

వడ్లు కాంటా పెడ్తలేరు
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు
టార్పాలిన్ కవర్లు లేక తడుస్తున్న వడ్లు
నష్టపోతున్నామంటూ రైతుల ఆవేదన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. దీంతో ఐకేపీ సెంటర్స్​కు రైతులు భారీగా వడ్లు తీసుకొస్తున్నారు. ఎండలు కూడా పెరగడంతో ప్రధానంగా మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కోతలు ఊపందుకున్నాయి. అయితే, సెంటర్స్​లో మాత్రం కొనుగోళ్లు జరగడం లేవు. ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి.

అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు స్పీడప్ చేయాలంటూ కొన్ని జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గన్నీ సంచులతో పాటు టార్పాలిన్ కవర్ల కొరత ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిపోతున్నదని బాధపడుతున్నారు.

రంగు మారుతున్న వడ్లు

రంగు మారిన వడ్లను మిల్లర్లు దించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ లేని, నల్లబడిన ధాన్యం కొనుగోళ్లకు ఎట్ల పర్మిషన్ ఇస్తారంటూ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అటు అధికారులు, ఇటు మిల్లర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. వడ్లు కాంటా వేసి లారీల్లో మిల్లింగ్​కు పంపిస్తే మూడు రోజులైనా దించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లుకు డైలీ 15 నుంచి 20 లారీలు పోతే అందులో నాలుగైదు లారీలనే అన్​లోడ్​ చేస్తున్నారని అంటున్నారు.

సర్కార్ నిర్లక్ష్యమే కారణం

సర్కారు నిర్లక్ష్యం కారణంగానే ఎంతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతున్నది. వడ్లు కాపాడుకోవడానికి, అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. సెంటర్​లో వడ్లు పోసి 15 రోజులు అవుతంది. ఎప్పటికప్పుడు కాంటా పెట్టి లోడ్లు పంపిస్తే సమస్య ఉండదు. సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నం.

‑ సోమయ్య, రైతు, పోలుమల్ల గ్రామం, సూర్యాపేట జిల్లా