ఆగం చేసిన అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం

ఆగం చేసిన అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం
  • నేలకొరిగిన వరి పైరు

మెదక్, సంగారెడ్డి, గజ్వేల్, వెలుగు: అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మెదక్ జిల్లాలో పలుచోట్ల సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణం, రూరల్​ మండలంతో పాటు, కొల్చారం, కొంగోడు, నాయిని జలాల్​ పూర్, పోతంశెట్​పల్లి, అప్పాజిపల్లిలో గంటల తరబడి కుండపోత వాన పడింది. దీంతో ఆయా చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొల్చారం, నాయిని జలాల్ పూర్, కొంగోడు కొనుగోలు కేంద్రాల్లో వరదకు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. 

చాలా మంది రైతులు ధాన్యాన్ని ఒకచోట కుప్పగా నేర్పి పరదాలు కప్పి వెళ్లినప్పటికీ కుండపోత వాన పడడంతో నీళ్లు లోపలికి వెళ్లి వడ్లు తడిసిపోయాయి. పలుచోట్ల లోతట్టుగా ఉన్న చోట ధాన్యం కుప్పల చుట్టూ నీరు నిలిచింది. తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కొల్చారంలో, నాయిని జలాల్​పూర్​లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు రాత్రి కురిసిన వర్షానికి  నేలకొరిగాయి.

 పంట కోసే సమయంలో ఈ పరిస్థితి నెలకొనడం రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. వరిపైర్లు నేలకొరగడం పొలంలో నీళ్లుండడంతో వడ్లు మొలకలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. అప్పాజిపల్లిలో కోసి పెట్టిన వరి మెదలు వర్షానికి తడిసిపోయాయి. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు టార్ఫాలిన్లు ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శివ్వంపేట  మండలంలోని పంబండా, సీతారాం తండా, భీమ్లా తాండ, శంకర్ తండాల్లో భారీ వర్షంతో ఆరబోసిన వడ్లు నీటిలో కొట్టుకపోయాయి. దాదాపు 30 నుంచి 40 మంది రైతుల వడ్లు వర్షానికి మట్టిలో కొట్టుకుపోయాయి.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో కురిసిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. సింగూర్​ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల  ప్రాజెక్టుకులోకి 5 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఏ టైంలో నైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో.. 

గజ్వేల్: అల్పపీడనం కారణంగా గజ్వేల్​నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం తేలికపాటి జల్లులు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి పంట నూర్పిళ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కొన్ని చోట్ల కోతకోసి రోడ్లపై, కళ్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. వర్షం ఎక్కువ పడితే ములుగు, వర్గల్​ తదితర మండలాల్లో సాగు చేసిన ఆలుగడ్డ విత్తనం మురిగిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆలు రైతులు ఆందోళన చెందుతున్నారు.