అవిశ్వాసం వద్దు...కౌన్సిలర్లకు బుజ్జగింపులు

అవిశ్వాసం వద్దు...కౌన్సిలర్లకు బుజ్జగింపులు

హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధికపై   25 మంది కౌన్సిలర్లు  అవిశ్వాస తీర్మానం పెట్టడంతో   బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది.  కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు  ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి   మున్సిపల్ కౌన్సిలర్లను తన ఆఫీస్ కు పిలిపించుకుని మాట్లాడారు.  మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధికపై అవిశ్వాస తీర్మాన లేఖను వెనక్కి తీసుకోవాలని  కౌన్సిలర్లను కోరారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కూర్చొని మాట్లాడుకుందామని కౌశిక్ సూచించారు. అయితే ప్రస్తుత చైర్పర్సన్ రాధికని తొలగించి వేరే ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని కౌన్సిలర్లు కౌశిక్ రెడ్డిని కోరినట్లు సమాచారం.

ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికపై 22 బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని  ప్రతిపాదిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఇన్ వార్డులో  లేఖను అందజేశారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా చైర్పర్సన్ రాధిక సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని,  తమ వార్డులకు నిధులు కేటాయించడంలేదని అవిశ్వాస లేఖలో పేర్కొన్నారు. చైర్పర్సన్  భర్త బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.  వెంటనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.