- మాజీ డీఆర్డీవో సైంటింస్ట్ గడ్డమణుగు చంద్రమౌళికి అవార్డు
- ‘ఆకాశ్’ క్షిపణి తయారీలో కీలకపాత్ర'
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సైంటిస్ట్ గడ్డమణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. దేశ రక్షణ వ్యవస్థలో భాగమైన డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. తన కెరీర్ లో 34 ఏళ్ల పాటు ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థ తయారీలో కీలకంగా చంద్రమౌళి పనిచేశారు.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆకాశ్ క్షిపణి వ్యవస్థను తయారు చేసే బాధ్యతను ప్రముఖ శాస్త్రవేత్త ప్రహ్లాద్ రామారావుకు అప్పగించినప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన తొలి టీమ్‌లో చంద్రమౌళి కూడా ఉన్నారు. తర్వాత ఆయన డీఆర్డీఓలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. కాగా, ఆయన ఖమ్మం జిల్లా మధిరలోని ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్థానిక టీవీఎం స్కూల్ లో పదో తరగతి వరకు చదివారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్, వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కళాశాలలో (ఆర్ఈసీ)లో 1981లో బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు.
ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ చదివిన తర్వాత, రెండేండ్లు ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేశారు. 1983 డిసెంబర్లో యూపీపీఎస్సీ ద్వారా డీఆర్డీఏలో ఉద్యోగం పొందారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం శిష్యరికంలో ఇంటిగ్రేటెడ్ గ్రైనెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఐజీఎండీపీ)ను ప్రారంభించారు. తర్వాత చంద్రమౌళిని ఆకాశ్ ప్రాజెక్టులో డాక్టర్ ప్రహ్లాద దగ్గర అబ్దుల్ కలాం నియమించారు.
తర్వాత ఆకాష్ క్షిపణి ప్రాజెక్టుకు చంద్రమౌళి డైరెక్టర్ అయ్యారు. ఆయన హయాంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్ క్షిపణిని తయారు చేసి, దేశానికి అందజేశారు. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు దీన్ని రూపొందించారు. హైదరాబాద్లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాష్క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు.
ఎంత బిజీగా ఉన్నా ఏడాదికోసారైనా తన స్వగ్రామం మధిరకు వచ్చి బంధుమిత్రులతో గడిపివెళ్లే గడ్డమణుగు చంద్రమౌళికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ దక్కడం పట్ల స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
