పద్మశ్రీ గ్రహీతను బలవంతంగా డ్యాన్స్ చేయించిన సోషల్ వర్కర్

పద్మశ్రీ గ్రహీతను బలవంతంగా డ్యాన్స్ చేయించిన సోషల్ వర్కర్

ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత  కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితమే ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య విషమించిందని, కోలుకోవడం కష్టమని వైద్యులు స్పష్టం చేసినా.. ఆ తర్వాత ఆమె అనూహ్యంగా కోలుకుని ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఆమె హాస్పిటల్ ఐసీయూలో ఉన్న సమయంలో ఓ సోషల్ వర్కర్ వద్దన్నా వినకుండా తనతో డ్యాన్స్ చేయించిందని పుజారి ఆరోపణలు చేశారు. డ్యాన్స్ చేయాలన్న ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని చెప్పినా వినకుండా  అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తనతో డ్యాన్స్ చేయించిందని చెప్పుకొచ్చారు.

ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ పలువురు ఇప్పటికే ఒడిశా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పుజారి చికిత్స తీసుకున్న కటక్ ఎస్ సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సైతం స్పందించింది. ఆమె పుజారా ఐసీయూలో అడ్మిట్‌ కాలేదని, ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాబిన్‌ ఒకటి కేటాయించామని తెలిపింది. ఆమె క్యాబిన్ లో ఉన్నప్పుడే ఆ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పుజారితో పాటు ఆస్పత్రిలో వెంట ఉన్న రాజీబ్‌ హిలాల్‌.. మమతా బెహెరా ఎవరో తనకు తెలియదని, అభిమానంటూ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ఇదంతా చేసిందని తెలిపారు. మమతా బెహెరా మాత్రం ఆమెలో బద్ధకాన్ని పొగొట్టి.. హుషారు నింపేందుకే అలా చేయించానని చెప్తున్నారు. 

ఇదిలా ఉండగా ఒడిషాలోని కమలా పుజారి ఓ గిరిజన తెగకు చెందినవారు. వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను 2019లో పద్మశ్రీతో సత్కరించింది. సేంద్రీయ వ్యవసాయం, 100 రకాల పాతతరం విత్తనాల నిల్వకుగానూ ఆమె ఈ గౌరవం దక్కింది. అయితే.. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆమె పరిస్థితి విషమించగా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు.