
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ నిధులతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ పేపర్లలో భారీగా యాడ్స్ ఇస్తున్నారన్నారు. ఇటీవల పాలమూరు ప్రాజెక్ట్ మోటార్ ఓపెనింగ్ కు అన్ని పేపర్లలో అధికార పార్టీ భారీగా యాడ్స్ ఇచ్చి ఈసీ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించిందన్నారు. ఈ మేరకు బుధవారం సీఈసీ రాజీవ్ కుమార్ కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
లేఖతో పాటు పాలమూ రు ప్రాజెక్ట్ మోటార్ ఓపెనింగ్ కు ప్రభుత్వం ఇచ్చిన పేపర్ యాడ్స్ క్లిప్పింగ్స్ ను పంపించారు. సర్కారు ఖర్చుతో యాడ్స్ ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందటానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పర్మిషన్లు తీసుకోకుండా ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేశారని, 4 ఏండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్.. 8 ఏండ్లు గడిచినా.. 40 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించారని, ఎలక్షన్స్ కోసం ఈసీ ఖరారు చేసిన గైడ్ లైన్స్ ను పకడ్బందీగా అమలు చేయాలని సీఈసీని పద్మనాభరెడ్డి కోరారు.