- వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ బాలస్వామి
హైదరాబాద్, వెలుగు: హిందూ విశ్వాసాలపై నమ్మకంలేని వ్యక్తులు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంలో తలదూర్చడం తగదని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి అన్నారు. లడ్డూ ప్రసాదం కలుషితంపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
ఈ విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని, ఇది రాజకీయ విమర్శలకు సంబంధించిన అంశం కాదన్నారు. హిందూ దేవుళ్లపై విశ్వాసం లేని వ్యక్తులు ఈ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హిందువుల విశ్వాసాలు నచ్చకపోతే మౌనంగా ఉండాలని, వ్యంగ్యంగా, ఎగతాళి చేసేలా మాట్లాడితే సహించేది లేదని బాలస్వామి హెచ్చరించారు.
