
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు. ఇందులో పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టారు. పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్.. సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను మన జవాన్లు మట్టుబెట్టారు. హషీమ్ మూసా గతంలో పాక్ ఆర్మీలో పని చేశాడు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులను యాసిర్, అబు హమ్జాగా గుర్తించారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో యాసిర్ కూడా ఉన్నాడు. నిరుడు సోనామార్గ్ టన్నెల్‌లో జరిగిన టెర్రర్ దాడిలో అబు హమ్జా పాల్గొన్నాడు. 14 రోజులుగా భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ట్రాక్ చేస్తూ వచ్చారు. ఈ ఎన్కౌంటర్.. శ్రీనగర్ దగ్గరలోని హర్వాన్ – లిద్వాస్ దట్టమైన అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి 2 ఏకే 47 రైఫిల్స్, 17 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ కొనసాగుతోందని ఆర్మీ ప్రకటించింది. నిఘా వర్గాల సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
జులై మొదటి వారం నుంచే కూంబింగ్
హర్వాన్ ప్రాంతంలోని దట్టమైన అడవిలో టెర్రరిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికలను ఆర్మీ సిద్ధం చేసుకున్నది. దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం పేరు ఆధారంగా జులై ప్రారంభంలోనే ‘ఆపరేషన్ మహదేవ్’ లాంచ్ చేసింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మహదేవ్ పర్వతంపైన దట్టమైన అడవిలో చైనీస్ ఆల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్‌గా ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. ఆ డివైజ్‌ను టీ82 ఆల్ట్రా సెట్‌గా కన్ఫార్మ్ చేసుకున్నది. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులే ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌ల కోసం చైనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్‌ను ఉపయోగిస్తుంటారు. వెంటనే బలగాలు అప్రమత్తం అయ్యాయి.
30 నిమిషాల్లోనే కొండపైకి..
సోమవారం ఉదయం 8 గంటలకు డ్రోన్ ఎగురవేశారు. 9.30 కల్లా టెర్రరిస్టుల లొకేషన్‌ను గుర్తించారు. రాష్ట్రీయ రైఫిల్ బృందం, పారా స్పెషల్ కమాండో దళాలు 10 గంటలకల్లా మహదేవ్ కొండపైకి చేరుకున్నాయి. టెర్రరిస్టుల కదలికలను గుర్తించిన కమాండోలు 11 గంటలకు కాల్పులు ప్రారంభించారు. 11.45 గంటలకు వెళ్లి చూడగా.. ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయి ఉన్నారు. గాయపడిన మరో టెర్రరిస్టు పారిపోతుండగా బలగాలు మట్టుబెట్టాయి.
ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. రేడియస్‌లో కూంబింగ్ చేపట్టారు. 12.45 గంటలకు డెడ్‌బాడీలను గుర్తించి ఫొటోలు తీసుకున్నారు. మొత్తం 3 గంటల్లోనే ‘ఆపరేషన్ మహదేవ్’ను సక్సెస్ చేశారు. దట్టమైన అడవిలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్ వేసుకొని టెర్రరిస్టులు దాక్కున్నట్లు గుర్తించారు. మొత్తం ఐదు నుంచి ఏడుగురు టెర్రరిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.