
కుక్కతోక వంకర సామెత మనందరం వినే ఉంటాం. దానిని ఎంత మార్చాలనున్నా వంకరగానే తిరుగుతుంది అన్నది ఎంత నిజమో.. దాయాది పాకిస్తాన్ మారుతుందని భావించటం కూడా అంతే తప్పు. ఈ విషయం మరో సారి రుజువు చేసుకుంది పాక్. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళాలు నాశనం చేసిన ఉగ్రవాద శిబిరాలు, ఉగ్ర ట్రైనింగ్ క్యాంపులను యుద్ధ ప్రాతిపధికన తిరిగి నిర్మించటం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. దీనికి సంబంధించి భారత నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో నాశనం చేయబడిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పాక్ పునరుద్ధరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఈ కార్యాలయం మురిడ్కే (పంజాబ్, పాకిస్తాన్) లో జరిగిన వైమానిక దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరేకు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే 4 కోట్ల పాకిస్తానీ రూపాయలు లష్కరే కు ఇచ్చినట్లు సమాచారం. ఈ పునర్నిర్మాణానికి మొత్తం ఖర్చు సుమారు 15 కోట్ల పాకిస్తానీ రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పనులు లష్కరే ప్రధాన కమాండర్లు మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షణలో జరుగుతాయని భారత ఇంటెలిజెన్స్ నివేదిక సూచిస్తోంది. పునర్నిర్మాణ పనులు 2026 ఫిబ్రవరి 5 నాటికి పూర్తిగా చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని.. అక్కడే ఉగ్రవాదులకు శిక్షణ, వసతి ప్రాంతాలను మళ్లీ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
ఉగ్రవాదులకు సంబంధించిన కార్యాలయాలు, క్యాంపులు నిర్మించటానికి పాక్ ప్రభుత్వం నిధులను కేటాయించటంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. 2005లో కూడా భూకంపం సమయంలో సేకరించిన విరాళాల్లో 80 శాతం ఈ ఉగ్రవాద సంస్థకు మళ్లించింది దాయాది. తాజాగా అదే స్ట్రాటజీ అమలు చేస్తూ ప్రస్తుతం బాధితులకు సాయం పేరుతో నిధులను కేటాయిస్తూ ఉగ్ర స్థావరాల నిర్మాణానికి వరద సాయం పేరుతో డబ్బు అందిస్తోంది అక్కడి ప్రభుత్వం.
భారత సరిహద్దులకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మురీద్కేలోని 82 ఎకరాల లక్షరే క్యాప్ తిరిగి యాక్టివేట్ చేయాలని పాక్ నిర్ణయించుకుంది. ఈ ప్రాంతంలో మదర్సాలు, మార్కెట్ వంటి అనేక సౌకర్యాలతో కూడిన పెద్ద ఉగ్రవాద శిక్షణ క్యాంప్ లష్కరే నిర్వహిస్తోంది. 2000 సంవత్సరంలో దీని నిర్మాణానికి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలు విరాళంగా కూడా అందించారు. లష్కరే తోయిబా కార్యకలాపాలకు ఒక విధంగా ఇది గుండెకాయ వంటిది. అందుకే దీనిని పాక్ ప్రభుత్వం శరవేగంగా తిరిగి నిర్మించటానికి చర్యలు చేపట్టిందని భారత వర్గాలు చెబుతున్నాయి.