మసూద్‌ ఆస్తుల జప్తుకు పాక్‌ ఆదేశాలు

మసూద్‌ ఆస్తుల జప్తుకు పాక్‌ ఆదేశాలు

ఇస్లామాబాద్‌: జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ అధిపతి మసూద్‌ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం మసూద్‌పై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం అతడి ఆస్తులను జప్తు చేయాలంటూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఆయుధాల కొనుగోలు, విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్‌ ప్రభుత్వం ఓ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఆంక్షల కమిటీ నిబంధనలకు అనుగుణంగా మసూద్‌పై తగు చర్యలు తీసుకుంటున్నామని నోటిఫికేషన్‌లో తెలిపింది. మసూద్‌ విదేశీ ప్రయాణాలపైనా పాక్‌ నిషేధం విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని ప్రకటించిన పాక్‌.. అతడిపై వెంటనే ఆంక్షలను అమలు చేస్తామని తెలిపింది ఆ దేశ విదేశాంగశాఖ.