PAK vs ENG: ఒక్కరోజే 506 పరుగులు..112 ఏళ్ల రికార్డ్ బద్దలు

PAK vs ENG: ఒక్కరోజే 506 పరుగులు..112 ఏళ్ల రికార్డ్ బద్దలు

క్రికెట్ చరిత్రలో మరో రికార్డ్ నమోదయ్యింది. రాక రాక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్ లో ఒక్కరోజే 500లకు పైగా పరుగులు చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. ఇవాళ రావల్పిండిలో పాకిస్థాన్ తో జరుగుతోన్న ఫస్ట్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 75 ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి  506 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం విశేషం. టెస్టులో ఒకే రోజు 494 పరుగులతో ఆస్ట్రేలియా పేరిట  112 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ  రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ జట్టు మొదటి రోజు 494 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ చితక్కొట్టింది. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచేనా అని అభిమానులు నోరెల్లబెట్టాల్సి వచ్చింది.  ఒపెనర్లు జాక్ క్రాలే 111 బంతుల్లో 122 (21 ఫోర్లు), బెన్ డకెట్  110 బంతుల్లో107 (15 ఫోర్లు), ఓలీ పోప్ 104 బంతుల్లో108 (14 ఫోర్లు), హర్రీ బ్రూక్ 81 బంతుల్లో 101 నాటౌట్ (14 ఫోర్లు 2 సిక్సులు) తో రెచ్చిపోయారు. ఆటముగిసే సమయానికి  క్రీజులో  బ్రూక్ 101, బెన్ స్టోక్స్ 34 పరుగులతో ఉన్నారు.

టెస్టు క్రికెట్ లో తొలి రోజే అత్యధిక స్కోర్ చేసిన జట్లు

  • ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (2022) -       506 పరుగులు(ఇవాళ)
  • ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (1910)-  494 
  • ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (2012) - 482 
  • ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1934) -  475 
  • ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా (1936) -     471