ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ‘ఎంఐ-17’ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న 21 మంది సైనిక సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం పీఓకేలోని నీలం వ్యాలీ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. టేకాఫ్ సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ‘‘హెలికాప్టర్‌లో ఉన్న సైనిక సిబ్బంది అంతా వీరమరణం పొందారు.
ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు’’ అని పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘోర ప్రమాదంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్), ఆర్మీ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి పాక్ అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
