
అబుదాబి: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో నిలకడగా ఆడిన పాకిస్తాన్.. ఆసియా కప్ సూపర్–4 స్టేజ్‌లో బోణీ చేసి ఫైనల్ రేసులో నిలిచింది. వరుసగా రెండో ఓటమితో శ్రీలంక ఫైనల్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. హుస్సేన్ తలత్ (32 నాటౌట్, 2/18) ఆల్‌రౌండ్ షోకు తోడు మహ్మద్ నవాజ్ (38 నాటౌట్), పేసర్ షాహిన్ షా ఆఫ్రిది (3/28) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 133/8 స్కోరుకే పరిమితమైంది.
కమిందు మెండిస్ (44 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. మిగతా వారు నిరాశపర్చారు. స్టార్టింగ్ నుంచే లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 18 రన్స్‌కే ఓపెనర్లు పాథుమ్ నిశాంక (8), కుశాల్ మెండిస్ (0) వెనుదిరిగారు. కుశాల్ పెరీరా (15), చరిత్ అసలంక (20) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
మూడో వికెట్‌కు 25 రన్స్ జోడించి కుశాల్ పెరీరా వెనుదిరగడంతో కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు. పవర్‌ప్లేలో 53/3 స్కోరు చేసిన లంకను మెండిస్ ఆదుకున్నాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక భాగస్వామ్యాలు జోడించాడు. 8వ ఓవర్‌లో హుసేన్ తలత్.. అసలంక, డాసున్ షనక (0)ను ఔట్ చేయడంతో స్కోరు 58/5గా మారింది. ఈ దశలో మెండిస్‌కు జతయిన వానిందు హసరంగ (17), చమిక కరుణరత్నే (17 నాటౌట్) నిలకడగా ఆడారు. ఈ ముగ్గురు కలిసి 63 రన్స్ జోడించారు. ఈ క్రమంలో మెండిస్ 43 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
చివర్లో దుష్మంత చమీరా (1) నిరాశపర్చడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత పాకిస్తాన్ 18 ఓవర్లలో 138/5 స్కోరు చేసింది. సాహిబ్జదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (17) తొలి వికెట్‌కు 45 రన్స్ జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు వెనుదిరిగారు. ఆ వెంటనే ఏడు రన్స్ తేడాలో సైమ్ (2), సల్మాన్ ఆగా (5) ఔటయ్యారు. దీంతో 57/4తో పాక్ ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో తలత్ నిలకడగా ఆడినా, మహ్మద్ హారిస్ (13) విఫలమయ్యాడు. అయితే, నవాజ్ బ్యాట్ ఝుళించాడు. తలత్‌తో ఆరో వికెట్‌కు 58 రన్స్ జత చేసి గెలిపించాడు. హుస్సేన్ తలాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.