
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ దాడులకు పాల్పడుతున్నది. మన డిఫెన్స్ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ చేస్తున్నది. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్టు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ డేటా మా సొంతమైంది. మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ వెబ్‌సైట్ నుంచి 1600 మందికి చెందిన 10 జీబీకి పైగా డేటాను సేకరించాం” అని అందులో పేర్కొంది. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసేందుకు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ప్రయత్నించింది.
అందులోని కొన్ని ఫొటోలను మార్చి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఆన్‌లైన్ నిలిపివేసి, పూర్తిగా ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కాగా, పాక్ సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామని డిఫెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హ్యాకర్ల చేతికి చిక్కి ఉంటుందని పేర్కొన్నాయి. మరిన్ని సైబర్ దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి. ఇంతకుముందు కూడా కొన్ని డిఫెన్స్ వెబ్‌సైట్లను పాక్ హ్యాక్ చేసింది.