- ఆరుగురికి గాయాలు..ముగ్గురి పరిస్థితి విషమం
- పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఘటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న పటాకుల ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురికి 98 శాతం కాలిన గాయాలుకావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ సిటీలోని లతీఫాబాద్ ఏరియాలో లైసెన్స్ లేని బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి యూనిట్‌లోని ఒక భాగం కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా..మరి కొందరు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారని వివరించారు.
రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత పేలుడుకు అసలు కారణం తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. అక్కడ పటాకులను అక్రమంగా తయారు చేస్తున్నారని, ఫ్యాక్టరీ యజమాని అసద్ జై పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.
ఘటనపై సింధ్ సీఎం మురాద్ అలీ షా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించారు.ఈ ఏడాది ఆగస్టులోనూ కరాచీలోని ఓ అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో ఇలాంటి పేలుడే సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు మరణించగా, 33 మంది గాయపడ్డారు.
